ఫోని తుఫాన్ : శ్రీకాకుళానికి తప్పిన ముప్పు

ఫోని తుఫాను ఉత్తరాంధ్రను గజగజా వణికించింది. తుఫాను ప్రభావంతో ఆయా జిల్లాల్లో మే 02వ తేదీ నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గంటకు 180 కిలోమీటర్లకు పైగా గాలులు వీయడంతో తీరప్రాంత వాసులు భయంతో వణికిపోయారు. మరోవైపు తుఫాను తీరం దాటడంతో శ్రీకాకుళం జిల్లాకు ముప్పు తప్పింది. ఆర్టీజీఎస్ ముందుగా సూచించిన విధంగానే తుఫాను గమ్యం సాగించిందని జిల్లా కలెక్టర్ నివాస్ తెలిపారు. అలాగే వర్షపాతం కూడా అంచనా వేసిన విధంగానే నమోదైందని చెప్పారు.
తీరానికి దగ్గర ప్రాంతాలకు ముప్పు ఉంటుందన్న ముందస్తు అంచనా మేరకు ఆ గ్రామాల నుంచి ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించినట్టు తెలిపారు. ఇచ్ఛాపురంలో మూడు కచ్చా ఇళ్లు మినహా…ఆస్తి, ప్రాణ నష్టాలపై ఎలాంటి నివేదిక అందలేదన్నారు. కవిటి, కంచిలి, సోంపేట, పలాస, వజ్రపు కొత్తూరు ప్రాంతాల్లో బలమైన గాలులుతో పలు చోట్ల చెట్లు నేలకొరిగాయి. పాక్షికంగా ఇండ్లు దెబ్బతిన్నాయి.
మరో నాలుగు గంటలపాటు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈదురుగాలులు బలంగా వీయడంతో జిల్లాలో పంటలు నేలకొరిగాయి. అరటి తోట పూర్తిగా ధ్వంసం అయింది. కొబ్బరి చెట్లు కూడా విరిగిపడ్డాయి. చేతికొచ్చిన పంట చేజారి పోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.