ప్రకాశం టీడీపీలో అసమ్మతి : రోడ్డెక్కిన తమ్ముళ్లు

ప్రకాశం : టీడీపీలో గ్రూపు రాజకీయాలు ఎక్కువయ్యాయి. నియోజకవర్గాల్లో నాయకులు గ్రూపులుగా మారి పార్టీకి తలనొప్పిగా తయారవుతున్నారు. ఒకవైపు ఎన్నికలు తరుముకొస్తుంటే.. మరోవైపు నాయకులు టిక్కెట్ తమకంటే తమకంటూ రోడ్డునపడుతున్నారు. ఈ క్రమంలో జిల్లాలోని కొండేపీలో మరోసారి టీడీపీలో అసమ్మతి పొగలు రాజుకుంటున్నాయి. కొండేపిలో టీడీపీ నేతలు రోడ్డెక్కారు. ఎమ్మెల్యే బాలవీరాంజనేయ స్వామికి వ్యతిరేకంగా ఆరు మండలాలకు చెందిన దామచర్ల జనార్థన్ వర్గీయులు పొన్నలూరు లో సమావేశమయి స్వామికి ఎమ్మెల్యే టిక్కెట్ దక్కకుండా చేసేందుకు పావులు కదుపుతున్నారు.
గతంలో చెలరేగిన అసమ్మతిపై ఒంగోలులో జరిగిన సమావేశంలో స్వామి తీరుపై సీఎం చంద్రబాబు మండిపడ్డారు. తీరును మార్చుకోకుంటే టిక్కెట్ ఇచ్చేది లేదని హెచ్చరించారు. అయినా తన పద్ధతిని మార్చుకోని స్వామి.. ఆయన వర్గీయులు పార్టీ కోసం పాటు పడుతున్న తమకు అగౌరపరుస్తున్నారనని దామచర్ల వర్గీయులు ఆరోపిస్తున్నారు. స్వామికి వచ్చే ఎన్నికల్లో సీట్ ఇవ్వకుండా చేసేందుకు టీడీపీ పర్యవేక్షణ సమితి సమావేశంలో దామచర్ల జనార్థన్ రెడ్డి వర్గీయులు ఏకమయ్యారు. స్వామికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో స్వామి..దామచర్ల వర్గీయుల మధ్య వాగ్వాదంతో స్థానికంగా ఉద్రిక్తత ఏర్పడింది.