35వేల ఎకరాల సంగతేంటి? : జగన్ ప్రకటనతో రాజధాని ప్రాంత రైతుల్లో కలవరం

ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానులంటూ అసెంబ్లీలో సీఎం జగన్‌ చెప్పిన మాటలు సంచలనం సృష్టిస్తున్నాయి. రాజధాని ప్రాంతవాసులు, రైతుల్లోనే కలవరం మొదలైంది.

  • Published By: veegamteam ,Published On : December 18, 2019 / 04:52 AM IST
35వేల ఎకరాల సంగతేంటి? : జగన్ ప్రకటనతో రాజధాని ప్రాంత రైతుల్లో కలవరం

Updated On : December 18, 2019 / 4:52 AM IST

ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానులంటూ అసెంబ్లీలో సీఎం జగన్‌ చెప్పిన మాటలు సంచలనం సృష్టిస్తున్నాయి. రాజధాని ప్రాంతవాసులు, రైతుల్లోనే కలవరం మొదలైంది.

ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానులంటూ అసెంబ్లీలో సీఎం జగన్‌ చెప్పిన మాటలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఊహించని స్టేట్‌మెంట్‌ విన్న తరువాత నేతల మైండ్‌బ్లాంక్‌ అయింది. ముఖ్యంగా టీడీపీకి షాక్‌ ఇచ్చే ప్రకటన ఇది. మరోవైపు ఉత్తరాంధ్ర, రాయలసీమ వాసులకు సంతోషాన్నిచ్చే స్టేట్‌మెంట్. ఎటొచ్చీ రాజధాని ప్రాంతవాసులు, రైతుల్లోనే కలవరం మొదలైంది. రాజధాని కోసం ఇచ్చిన 35 వేల ఎకరాల పరిస్థితేంటన్న మొదటి ప్రశ్న వినిపిస్తోంది. ఖాళీగా ఉన్న భూములను ప్రభుత్వం ఏం చేస్తుంది, రైతులకు ఇస్తామన్న ప్లాట్ల సంగతేంటి? ఇవన్నీ ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. 

రాజధాని నిర్మాణం జరిగితే భూములకు మంచి ధరలు వస్తాయని రైతులను ఒప్పించి ల్యాండ్‌పూలింగ్‌కు వెళ్లారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు. భూములు ఇచ్చిన వారికి తిరిగి ప్లాట్లు ఇస్తామన్నారు. చంద్రబాబు ప్లాన్‌ నచ్చడంతో గుంటూరు జిల్లాలోని తుళ్లూరు, తాడేపల్లి మండలాల్లోని రైతులు 35వేల ఎకరాలు ప్రభుత్వానికి అప్పగించారు. భూములు ఇచ్చిన రైతులకు ప్లాట్లను కేటాయించారు. ఈలోపే ఎన్నికలు రావడంతో చంద్రబాబు పదవి కోల్పోయారు. కాని, సీఎం జగన్‌ కూడా రైతులకు కేటాయించిన ఫ్లాట్లను అభివృద్ధి చేస్తామని మాట ఇచ్చారు.

ఉన్నట్టుండి అసెంబ్లీలో చేసిన ప్రకటన అందరికీ షాక్‌ ఇచ్చింది. అమరావతి ప్రాంతాన్ని కేవలం లెజిస్లేటివ్ క్యాపిటల్‌గా మాత్రమే చూస్తామంటోంది ప్రభుత్వం. అంటే, అసెంబ్లీ సమావేశాలప్పుడు మాత్రమే అమరావతిలో సందడి కనిపిస్తుంది. అమరావతిని కేవలం లెజిస్లేటివ్ క్యాపిటల్‌గా ఉంచితే.. రైతుల నుండి తీసుకున్న భూముల పరిస్థితి ఏమిటన్న ప్రశ్న వినిపిస్తోంది. పైగా అమరావతిలో 50 శాతానికి పైగా పూర్తైన నిర్మాణాలను పూర్తి చేయలని ప్రభుత్వం భావిస్తోంది. ఎమ్యెల్యేలు, మంత్రులు, ఐఏఎస్, ఉద్యోగుల క్వార్టర్స్ పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చాలా వరకు రోడ్లు వేశారు. ఇప్పుడున్న భవనాన్నే అసెంబ్లీగా కొనసాగిస్తారు. ఈ నిర్మాణాలన్నీ కలిపితే దాదాపు 5వేల ఎకరాలు కూడా లేవు. 

అవసరాన్ని బట్టి ఈ 5వేల ఎకరాల్లోని నిర్మాణాలు పూర్తి చేసి వాటిని ఉపయోగించుకున్నా.. మిగిలిన భూములు దాదాపు 30 వేల ఎకరాలు ఉంటుంది. ఇన్ని వేల ఎకరాలను ఏం చేస్తారన్నదే అర్థంకాని ప్రశ్న. రైతులకు భూములు తిరిగి ఇచ్చేస్తారా అనే వాదన కూడా వినిపిస్తోంది. అసలు భూములు తిరిగి ఇచ్చే పరిస్థితిలో లేవని కొందరు చెబుతున్నారు. ఎవరి భూమి ఎక్కడ ఉందో కూడా కనుక్కోలేని పరిస్థితిలో ఆ భూములు ఉన్నాయంటున్నారు. ఇప్పటికే 65 సంస్థలకు భూములు కేటాయించారు. చాలా వరకు పనులు మొదలుపెట్టలేదు. మరికొన్ని సంస్థల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ భూములను ప్రభుత్వం ఏం చేయబోతోందన్నది పెద్ద పజిల్‌గా మారింది. 

రైతుల భూములను గుర్తించి వాటిని వారికి వెనక్కి ఇవ్వడం సాధ్యం అయ్యే పని కాదనేది కొందరి వాదన. ప్రస్తుతం ఈ భూములన్నీ వ్యవసాయానికి పనికిరాని భూములుగా మారిపోయాయి. ముళ్లపొదలతో నిండిపోయాయి. నిర్మాణాలు జరుగుతున్నందున మెటల్ పడి, వాహనాలు తిరిగి, మధ్యలో రోడ్ల నిర్మాణం జరగడం వల్ల వ్యవసాయ భూముల స్వరూపమే మరిపోయింది. వీటిని తిరిగి వ్యవసాయ భూములుగా మార్చుకోవడం అంటే.. ఉన్న ఆస్తులను కూడా అమ్ముకోవాల్సిందే అంటున్నారు ఇక్కడి రైతులు. మొత్తానికి ఎందుకూ అక్కరకు రాని భూములుగా ఇవి మిగిలిపోనున్నాయా అన్న అనుమానం కూడా వ్యక్తం అవుతోంది. 

అమరావతిలో పూర్తిస్థాయి రాజధాని నిర్మాణం ఇక ఆగిపోయినట్టే. ఇన్ని వేల ఎకరాల అవసరం కూడా ప్రభుత్వానికి లేదు. పోనీ, ఇచ్చేస్తామంటే తీసుకునే పరిస్థితుల్లో రైతులు లేరు. అలాగని, ఇన్ని వేల ఎకరాల భూములను నిరుపయోగంగా ఉంచితే ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చే ప్రమాదం ఉంది. అంటే ఈ భూములను ఏదో రకంగా ఉపయోగించుకోక తప్పదు. దీంతో అమరావతిలో పరిశ్రమలు ఏర్పాటు చేస్తారన్న వాదన వినిపిస్తోంది. సేకరించిన భూములను పరిశ్రమలకు కేటాయించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కృష్ణానది కూడా పక్కనే పారుతుండటంతో నీటి సమస్య లేదు. పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించి పరిశ్రమలు ఏర్పాటు చేయిస్తే స్థానికులకు ఉద్యోగాలు, ఉపాధి దక్కుతాయి. దీంతో ప్రభుత్వంపై వ్యతిరేకత కూడా తగ్గుతుంది. కాబట్టి, ఈ ప్రాంతంలో పరిశ్రమలను ప్రోత్సహించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఎవరికైనా ఇళ్ల స్థలాలు ఇవ్వాలనుకుంటే వారికి ఈ భూములను కేటాయించే అవకాశమూ ఉంది.

సీఎం జగన్‌ ప్రకటనపై అమరావతి రైతులు మండిపడుతున్నారు. అమరావతిని కేవలం అసెంబ్లీ సమావేశాలకే పరిమితం చేస్తున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూడు రాజధానుల ఆలోచన మానుకోవాలంటూ వెలగపూడిలో రైతులు ధర్నాకు దిగారు.