నీరో రామచంద్రా : అప్పుడే నీటి కష్టాలు 

  • Published By: madhu ,Published On : January 9, 2019 / 02:28 PM IST
నీరో రామచంద్రా : అప్పుడే నీటి కష్టాలు 

విజయనగరం : నేల నెర్రలు బారుతోంది..తీవ్ర వర్షాభావంతో అక్కడ నేల నెర్రలుబోతోంది. చుక్క నీరు దొరక్క మనుషులే కాదు పశు పక్ష్యాదులకూ ఇబ్బందులు తప్పడం లేదు. ఎన్నడూ లేని నీటి యాతన స్ధానిక ప్రజలకు నానా ఇక్కట్లు తెచ్చిపెడుతోంది. ఇప్పుడే ఇలా ఉంటే వచ్చే వేసవిలో పరిస్ధితి ఎలా ఉంటుందోనని జనం గుండెలు గుభేల్‌మంటున్నాయి. 
విజయనగరం జిల్లా ప్రజలు నీటికి కటకటా అంటున్నారు. సాగునీరు ఎలాగూ లేదు. కనీసం గుక్కెడు మంచినీళ్లు కూడా దొరకడం లేదు. జిల్లా కేంద్రంతో పాటు పలు పట్టణాలు, పల్లెల్లో కూడా ఇదే పరిస్థితి తలెత్తింది. నదులూ, కాలువలు ఎండిపోయాయి. భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో బోరుబావుల్లోనూ నీటి జాడ కనిపించడం లేదు. వర్షాకాలంలో కూడా సాధారణ వర్షపాతం నమోదు కావడం లేదు. డిసెంబర్లో వచ్చిన పెథాయ్ తుపాను కారణంగా ఆ నెలలో సాధారణ వర్షపాతం కంటే అధికంగా కురిసినా.. జలాశయాలు, చెరువుల్లో మాత్రం నీరు చేరలేదు. దీంతో జిల్లాలో కరువు పరిస్థితులు తలెత్తాయి. భూగర్భ జలాలు అంతకంతకూ తగ్గిపోతుండటంతో .. నీరో రామచంద్ర అనాల్సిన పరిస్థితి తలెత్తింది. 
విజయనగరం పట్టణంలో పరిస్థితి అయితే మీరీ దారుణంగా తయారైంది. పట్టణానికి మంచినీరు సరఫరా జరిగే తాటిపూడి రిజర్వాయర్ పూర్తిగా ఎండిపోయింది. రిజర్వాయర్ చరిత్రలో ఎన్నడూ ఇటువంటి దుస్ధితి రాలేదు. దీంతో అటు విశాఖతో పాటు విజయనగరం పట్టణానికి మంచినీటి సరఫరా నిలిచిపోవడంతో.. పట్టణ ప్రజలు దాహం కేకలు పెడుతున్నారు. నాలుగైదు రోజులకొకసారి నీరు సరఫరా చేస్తున్నా.. కనీసం బిందెనీళ్లు కూడా రావడం లేదని మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తాటిపూడి రిజర్వాయర్ పూర్తిగా ఎండిపోయింది
రిజర్వాయర్ చరిత్రలో ఈ దుస్ధితి ఎప్పుడూ రాలేదు
నాలుగైదు రోజులకొకసారి నీటి సరఫరా 

ఓ వైపు తాగునీటికి ప్రజానీకం కటకలాడుతోంటే…ఇదే అదనుగా నీటి వ్యాపారం జోరుగా సాగుతోంది. ఏప్రిల్, మే నెలలో ఉండాల్సిన నీటి ఎద్దడి ఇప్పుడే రావడంతో మంచినీటి డబ్బాలకు గిరాకీ పెరిగింది. సామాన్య ప్రజానీకానికి ప్రతీ రోజూ నీటి ప్లాంట్ల వద్దకు పరుగుతీయడం ఇప్పుడు అదనపు విధిగా మారింది. విజయనగరం పట్టణ పరిసర ప్రాంతాల్లో 30 వరకు మంచినీటి ప్లాంట్లున్నాయి. వీటి ద్వారా రోజుకు సుమారు 12 లక్షల లీటర్లు నీరు అమ్ముడవుతున్నట్లు అంచనా. వేసవిలో ఈ విక్రయాలు రెట్టింపు అవుతాయి. కానీ ప్రస్తుత పరిస్థితిల రీత్యా .. వేసవి పరిస్థితే కనిపిస్తోంది. 20 లీటర్ల క్యాన్లను 30 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా వ్యాపార పరంగానూ, స్వచ్చంధ సంస్థల పేరిట నీటిప్లాంట్లు గతంలో కంటే అధికమయ్యాయి. 
30 వరకు మంచినీటి ప్లాంట్లు
రోజుకు సుమారు 12 లక్షల లీటర్లు నీరు
వేసవిలో ఈ విక్రయాలు రెట్టింపు  
20 లీటర్ల క్యాన్‌ రూ.30 

వాస్తవానికి ఖరీఫ్ సీజన్ నుంచే జిల్లాలో కరువు పరిస్థితిలు తలెత్తాయి. దీంతో 38వేల 160 హెక్టార్లలో వరి పంట పూర్తిగా ఎండిపోగా, మిగిలిన విస్తీర్ణంలో దిగుబడులు గణనీయంగా పడిపోయాయి. జిల్లాలో మొత్తం 34 మండలాలుంటే, అందులో 26 మండలాలను కరువు మండలాలుగా ప్రభుత్వం ప్రకటించిందంటే .. పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. దిగుబడులు తగ్గిపోవడం, పండిన పంట ఉత్పత్తికి గిట్టుబాటు ధర లేకపోవడంతో .. జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించి ఆదుకోవాలని రైతులు తరచూ ఆందోళనబాట పడుతున్నారు. 
నీటి ఎద్దడిపై అధికారులు, ప్రజాప్రతినిధులు తక్షణం స్పందించాల్సిన అవసరం ఉంది. ప్రత్యామ్నాయ మార్గాలపై ఇప్పటి నుంచే దృష్టి పెట్టకపోతే.. రానున్న వేసవిలో పరిస్థితి చేయిదాటిపోయే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.