రూ. 15 లక్షలు కాజేశారు : ఎన్నికల సిబ్బందిపై కర్నూలు SPకి కంప్లయింట్

  • Published By: madhu ,Published On : April 28, 2019 / 04:42 AM IST
రూ. 15 లక్షలు కాజేశారు : ఎన్నికల సిబ్బందిపై కర్నూలు SPకి కంప్లయింట్

Updated On : April 28, 2019 / 4:42 AM IST

కర్నూలు జిల్లాలో ఎన్నికల సిబ్బంది చేతి వాటం ప్రదర్శించారు. తనిఖీల్లో భాగంగా ఓ వ్యక్తి నుండి స్వాధీనం చేసుకున్న రూ. 15 లక్షల డబ్బును ఫ్లయింగ్ స్వ్కాడ్స్ సిబ్బంది కాజేశారు. తన డబ్బును తిరిగి ఇప్పించాలని బాధితుడు కోరుతున్నాడు. జిల్లా SPకి బాధితుడు ఈ విషయం కంప్లయింట్ చేయడంతో విషయం బయటకు పొక్కింది. దీనిపై జిల్లా SP సీరియస్ అయ్యారు.

ఆంధప్రదేశ్ రాష్ట్రంలో ఏప్రిల్ 11న లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఎన్నికలు ఉండడంతో ముందస్తు తనిఖీలు, సోదాలను ఈసీ అధికారులు, పోలీసులు జరిపారు. ఏప్రిల్ 7వ తేదీన జిల్లాలోని కోడుమూరు నియోజకవర్గ పరిధిలోని  పుల్లారెడ్డి కాలేజీ వద్ద ఫ్లయింగ్ స్వ్కాడ్ సిబ్బంది సోదాలు చేస్తున్నారు. ఈ సమయంలో హైదరాబాద్ నుండి వస్తున్న ఇన్నోవా వాహనాన్ని తనిఖీ చేశారు. అందులో రూ. 15 లక్షలు లభ్యమయ్యాయి. అందులో ప్రయాణిస్తున్న వ్యక్తి వద్ద డబ్బుకు సంబంధించి ఆధారాలు లేకపోవడంతో ఏమి చేయలేకపోయాడు.

ఆధారాలు చూపించాలి..అప్పుడు డబ్బులిస్తామని ఫ్లయింగ్ స్వ్కాడ్ సిబ్బంది తెలిపారు. చేసేది ఏమీ లేక తిరిగి హైదరాబాద్‌కు వెళ్లిపోయాడు. డబ్బుకు సంబంధించిన ఆధారాలు పట్టుకుని డబ్బులు ఇవ్వాలని కోరాడు. ఫ్లయింగ్ స్వ్కాడ్ నుండి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో ఏప్రిల్ 27వ తేదీ శనివారం జిల్లా SPని కలిశాడు. తన రూ. 15 లక్షల నగదు ఇప్పించాలని కోరాడు. అసలు విషయం తెలియడంతో జిల్లా ఎస్పీ సీరియస్ అయ్యారు. 

బాధితుడి నుండి ఫిర్యాదు తీసుకున్న జిల్లా SP తాలూకా పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల సమయంలో స్వాధీనం చేసుకున్న డబ్బు విషయంలో ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.