సార్వత్రిక సమరం : ఏపీలో పోలింగ్ ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ ప్రారంభమైంది. లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలకు ఓటింగ్ జరుగుతోంది. ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమై పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. సాయంత్రం 5 గంటలలోపు పోలింగ్ కేంద్రాల్లో క్యూలో ఉన్న ఓటర్లంతా ఓటుహక్కు వినియోగించుకునేందుకు ఈసీ అనుమతిచ్చింది. గురువారం(ఏప్రిల్ 11,2019) 175 అసెంబ్లీ స్థానాలకు, 25 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల బరిలో 2వేల 118 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. లోక్‌సభ బరిలో 319 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు.
ఏపీలో 3 కోట్ల 93 లక్షల 45 వేల 717 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో కోటి 94 లక్షల 62వేల 339 మంది పురుష ఓటర్లుకాగా… కోటి 98 లక్షల 79వేల 421 మంది మహిళా ఓటర్లు. టాన్స్ జెండర్లు మరో 3వేల 957 మంది ఉన్నారు. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 42 లక్షల 4వేల 436 మంది ఓటర్లు ఉండగా… అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 18 లక్షల 18వేల 113 మంది ఉన్నారు. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 46వేల 120 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 8 వేల 154 సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించింది.
4లక్షల 20వేల మంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. వీరిలో ఎన్నికల సిబ్బంది 3 లక్షలు కాగా.. లక్షా 20వేల మంది పోలీసులు ఎన్నికల విధుల్లో ఉన్నారు. 7,300 ఆర్టీసీ బస్సులు, 300 ప్రైవేట్ బస్సులను వినియోగిస్తున్నారు. 24 సీట్లున్న రెండు హెలికాప్టర్లనూ ఎన్నికల కోసం వినియోగిస్తున్నారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన ఓటు హక్కును అమరావతిలో వినియోగించుకోనున్నారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన ఓటు హక్కును పులివెందులలో వినియోగించుకుంటారు. జనసేనాని పవన్ కల్యాణ్ విజయవాడలో తన ఓటు వేయనున్నారు. ఇతర ప్రముఖులు తమ స్వగ్రామాల్లో ఓటుహక్కును వినియోగించుకోనున్నారు.