మొరాయిస్తున్న EMVలు : నిరీక్షిస్తున్న ఓటర్లు

ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. దీనితో పలు చోట్ల పోలింగ్ ప్రారంభం కాలేదు. ఏప్రిల్ 11వ తేదీ ఏపీలో లోక్ సభ, అసెంబ్లీ, తెలంగాణలో లోక్ సభ ఎన్నికలకు పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం నుండే ఓటర్లు ఓటు వేసేందుకు బారులు తీరారు. అయితే ఈవీఎంలు పనిచేయలేదు. దీనితో పలు జిల్లాల్లో మాక్ పోలింగ్ ఆలస్యంగా స్టార్ట్ అయ్యింది. ఉదయం 7గంటలకు ప్రారంభం కావాల్సిన పోలింగ్..కాస్త ఆలస్యమైంది. పలు చోట్లలో సిబ్బంది ఆలస్యం కూడా ఒక కారణంగా చెప్పవచ్చు.
కడప జిల్లాలో పలు చోట్ల ఈవీఎంలు మొరాయిస్తున్నాయనే సమచారం వస్తోంది. లోకోగటంలో 4వ బూత్, కమలాపురంలో 22వ, 15వ బూత్‌లో ఈవీఎంలు పనిచేయలేదు. మాచిరెడ్డిపల్లెలలో 999, పుల్లంపేటలోని 179వ బూత్, రాజంపేటలోని 163 బూత్‌లో, ఉండవల్లి బూత్ నెంబర్ 35, శ్రీకాకుళం జిల్లాలోని 36వ బూత్‌లో ఈవీఎంలు పనిచేయకపోవడంతో పలు సమస్యలు ఏర్పడ్డాయి. దీనితో పోలింగ్ ప్రారంభం కాలేదు. తాడేపల్లి నియోజకవర్గంలో పలు కేంద్రాల్లో ఈవీఎంలలో సమస్యలు ఏర్పడ్డాయి. తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాలో ఈవీఎంలు పనిచేయడం లేదు. పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. టెక్నికల్ సిబ్బంది సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 50 ఈవీఎంలు మొరాయించాయని ఏపీ ఎన్నికల అధికారి ద్వివేదీ వెల్లడించారు. తాడేపల్లి క్రిస్టియన్ పేటలోని మున్సిపల్ హై స్కూల్‌లో ఆయన ఓటు వేశారు. ఈవీఎంలలో నెలకొన్న సమస్యలు పరిష్కరించేందుకు టెక్నికల్ టీం పనిచేస్తోందన్నారు. ప్రతొక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని, సాయంత్రం 6గంటల వరకు క్యూ లైన్‌లో ఉన్న అందరికీ ఓటు హక్కును కల్పిస్తామన్నారు.