తహసీల్దారు కార్యాలయంలో రైతు ఆత్మహత్యాయత్నం

  • Published By: veegamteam ,Published On : November 14, 2019 / 08:31 AM IST
తహసీల్దారు కార్యాలయంలో రైతు ఆత్మహత్యాయత్నం

Updated On : November 14, 2019 / 8:31 AM IST

వనపర్తి జిల్లాలోని పెబ్బేరు మండలం తహసీల్దారు కార్యాలయంలో ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. చెలిమిల్ల గ్రామ శివారులో ఉన్న 208 సర్వే నెంబరులో రైతు ఆంజనేయులు తల్లి పేర 1 ఎకరా 26 గుంటల భూమి ఉంది. ప్రధాన రహదారి పక్కన ఉండటంతో కొంత మంది రియల్టర్ లు ఇప్పటికే కొంత కబ్జా చేసారు. బాధితుడు సర్వే కోసం దరఖాస్తు చేసినప్పటి నుంచి రియల్టర్ ల నుంచి బెదిరింపులు, మద్యవర్తులతో బేరసారాలు చేయడం ప్రారంభించారు. రైతు వినలేదని నేరుగా బెదిరింపులకు పాల్పడ్డారు. పెబ్బేరు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేశారు.

మూడు నెలల క్రితం కలెక్టర్ కు ఫిర్యాదు చేసినప్పటికీ బాధితుడికి న్యాయం జరుగలేదు. కొన్ని సందర్భాల్లో వ్యవసాయ శాఖ మంత్రి పేరు చెప్పి సర్వే జరుగకుండా వాయిదాలు వేస్తూ వచ్చింది. ప్రస్తుతం తహసీల్దార్ గా ఉన్న సుజాత నేడు, రేపు అనుకుంటూ సర్వే చేయకపోవటాన్ని రైతు నిలదీయటంతో గురువారం సర్వే చేయడానికి వచ్చే సర్వేయర్ కు తహసీల్దార్ ఫోన్ చేయటంతో సర్వే చేయకుండా వెనక్కి రావటంతో మనస్తాపానికి గురైన ఆంజనేయులు తహసీల్దార్ కార్యాలయం దగ్గర తనతో పాటు తెచ్చుకున్న పురుగుల మందు తాగడానికి ప్రయత్నం చేయగా, స్థానికులు అడ్డుకున్నారు. 

ఆందోళన చెందిన రైతు ఈ తహసీల్దార్ ఉన్నంత వరకు నా భూమి నాకు రానివ్వకుండా అడ్డుపడుతుందంటూ వెంట తెచ్చుకున్న పెట్రోలుతో నేరుగా తహసీల్దార్ చాంబర్ కు చేరాడు. పెట్రోలు పోసుకుని నిప్పు అంటించుకుంటుండగా కార్యాలయ సిబ్బంది, తదితరులు అందుబాటులో ఉన్న నీరు పోసి రక్షించారు. స్థానికులు తహసీల్దార్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.