అసలేం జరిగింది : శ్రీశైలం గేట్ల పైనుంచి ప్రవహిస్తున్న వరద నీరు

శ్రీశైలం డ్యాం దగ్గర ఆనకట్ట గేట్ల నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. శ్రీశైలం డ్యాం గేట్ల పైనుంచి వరద నీరు ప్రవహిస్తోంది. స్పిల్ వే నుంచి కాకుండా 2, 3, 10, 11, 12 గేట్లపై నుంచి నీరు పారుతోంది. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. శ్రీశైలం డ్యాం దగ్గర అధికారులు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. డ్యాం గేట్ల పైనుంచి వరద నీరు పారుతున్న దృశ్యాలు వైరల్ గా మారాయి.
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం జలాశయానికి వరద నీరు పోటెత్తుతోంది. దీంతో అధికారులు 6 గేట్లను 17 అడుగుల మేర ఎత్తి సాగర్ కు నీటిని విడుదల చేస్తున్నారు. కాగా ఆనకట్ట గేట్ల నిర్వహణలో అధికారుల అలసత్వం కారణంగా స్పిల్ వే నుంచి కాకుండా గేట్లపై నుంచి నీరు పారడం దుమారం రేపింది. జలాశయానికి 3.49 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా.. ఔట్ ఫ్లో 3.55 లక్షల క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం డ్యాం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు. ప్రస్తుతం 884.90 అడుగుల నీటిమట్టం ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ 215.80 టీఎంసీలు. ప్రస్తుతం 215.32 టీఎంసీల నీరు ఉంది. కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 2వేల 400 క్యూసెక్కులు, హంద్రీనీవాకు 2వేల 026 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకానికి 28వేల 500 క్యూసెక్కులు.. కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాలకు 80 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
డ్యామ్ గేట్లపై నుంచి నీరు ప్రవహించడం చర్చకు దారితీసింది. దీనిపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. ఆనకట్ట గేట్ల నిర్వహణలో ఇంత నిర్లక్ష్యం పనికి రాదని మండిపడ్డారు. డ్యూటీలో ఉండాల్సిన అధికారులు ఏమయ్యారు, ఎక్కడికి వెళ్లారు అనే దానిపై ఆరా తీస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. అసలేం జరిగిందో వివరణ ఇవ్వాలన్నారు.