చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం : 12 మంది దుర్మరణం
చిత్తూరు జిల్లా పలమనేరు సమీపంలోని మొగిలి ఘాట్ రోడ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 12 మంది మృతి చెందారు.

చిత్తూరు జిల్లా పలమనేరు సమీపంలోని మొగిలి ఘాట్ రోడ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 12 మంది మృతి చెందారు.
చిత్తూరు జిల్లా పలమనేరు సమీపంలోని మొగిలి ఘాట్ రోడ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 12 మంది మృతి చెందారు. కంటైనర్ బ్రేక్ లు ఫెయిల్ కావడంతో భారీ కంటైనర్ వాహనాలపైకి దూసుకెళ్లి, బోల్తా పడింది. కంటైనర్ కింద ఆటో, ఓమ్నీ వ్యాన్, టూవీలర్ ఉన్నాయి.
నీళ్ల బాటిళ్లతో బెంగళూరు నుంచి తిరుపతి వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
ఓమ్నీ వ్యాన్ లో ఉన్న ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మృతి చెందారు. ఆటోలో ఉన్న మహిళలంతా దుర్మరణం చెందారు. మృతులు గంగవరం మండలం మరిమాకులపల్లె వాసులుగా గుర్తించారు. మృతుల్లో ఎక్కువ మంది మహిళలే ఉన్నారు. 12 మృతదేహాలను వెలికి తీశారు. అవి ఏమాత్రం గుర్తుపట్టలేనంతగా ఉన్నాయి. శరీర భాగాలు నుజ్జునుజ్జయ్యాయి. అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.
రోడ్డు రెండు వైపుల పది కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. రోడ్డుకు అడ్డంగా పడిపోయిన కంటెయినర్ ను క్రేన్ల సహాయంతో తొలగిస్తున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న జిల్లా కలెక్టర్ భరత్ గుప్తా, పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు ప్రమాద వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు.