ఏపీలో ముందే ఎన్నికలు: పవన్ కళ్యాణ్ జోస్యం

ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక కొరత అంశంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో స్పందించారు. ఏపీలో ఇసుక విధానం అమలు చేయడంతో ప్రభుత్వం విఫలం అయ్యిందంటూ విరుచుకు పడ్డారు పవన్ కళ్యాణ్. ఇసుక కొరత ప్రభావం మొత్తం సమాజంపై పడిందని అన్నారు పవన్. వైసీపీ ప్రభుత్వం కొత్త ఇసుక విధానం తెచ్చినప్పుడు సంబరపడ్డామని ఇప్పుడు చూస్తే సమస్య మరింత పెద్దది అయ్యిందని అన్నారు. ప్రభుత్వం వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు.
అలాగే పది ఉద్యోగాల కోసం పది వేల మంది ఉద్యోగాలను తొలగిస్తున్నారని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ఇసుక కొరత వల్ల ఉపాధి పనులు దొరక్క 30 లక్షల మంది నిర్మాణ రంగ కార్మికులు రోడ్డున పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని నిర్మాణం ఉందో లేదో తెలియట్లేదని వైసీపీ ప్రభుత్వంపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని అన్నారు. రాష్ట్ర విభజన సమస్యలను ప్రభుత్వం పట్టించుకోట్లేదని పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు.
తెలంగాణలో 48 వేల మంది ఆర్టీసీ కార్మికులను ఒక్క మాటతో తీసేస్తే అన్ని పార్టీలు కలిశాయని, ఆంధ్రప్రదేశ్‌లో 30లక్షల మంది రోడ్డునపడితే ఇక్కడ రాజకీయ వ్యవస్థలో పౌరుషం కనిపించట్లేదని అన్నారు. మన వ్యవస్థ గ్రూపులుగా, వర్గాలుగా విడిపోయి ఉన్నారని, జనసేన పార్టీ మాత్రం ఎవరికి సమస్య వచ్చినా అండగా నిలబడుతుందని అన్నారు.
దేశంలో లక్షల కోట్లు దోపిడి చేసే వ్యవస్థలు ఉన్నాయి కానీ అందరికీ నిలువ నీడ కల్పించే ఒక భవన నిర్మాణ కార్మికుడికి రక్షణ కల్పించే పరిస్టితులు లేవన్నారు పవన్ కళ్యాణ్. సమస్యలు ఇలాగే సాగితే ఏ ప్రజలు అయితే అధికారం ఇచ్చారో వాళ్లే ఇంటికి పంపిస్తారని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ముందే ఎన్నికలు వచ్చే అవకాశం కూడా ఉందని పవన్ కళ్యాణ్ జోస్యం చెప్పారు.