కాకినాడ రూరల్ రాజకీయం : గెలుపుపై అన్ని పార్టీల ధీమా

కాకినాడ రూరల్‌లో రాజకీయం వేడెక్కింది. ఎన్నికల్లో మూడు పార్టీలు హోరాహోరీగా తలపడేందుకు సిద్ధమవుతున్నాయి. గతంలో ప్రజారాజ్యం జయకేతనం ఎగురవేసింది. సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యేకు గట్టి పోటీ ఇవ్వాలని జనసేన, వైసీపీ పట్టుదలగా ఉన్నాయి. కాకినాడ రూరల్ .. 2009 పునర్విభజనలో భాగంగా ఏర్పడింది. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం అభ్యర్థిగా కురసాల కన్నబాబు విజయం సాధించారు. చిరంజీవి ఛరిష్మాతో విజయం సాధించినా 2014లో సీన్ ఛేంజ్ అయింది. 2014లో ఇండిపెండెంట్‌గా బరిలో దిగి..థర్డ్ ప్లేస్‌లో నిలబడాల్సి వచ్చింది. వైసీపీ నేత చెల్లుబోయిన వేణుపై టీడీపీ అభ్యర్థి పిల్లి అనంతలక్ష్మి ఘన విజయం సాధించారు.
ఏపీలో పొలిటికల్ పరిణామాలు మారిపోతున్నాయి. కొత్త పార్టీలు వచ్చేశాయి. అందులో జనసేన ఒకటి. పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన ఈ పార్టీ…ఇమేజ్, కాపు సామాజికవర్గం ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంచనా. టికెట్ కోసం ఆశావాహుల సంఖ్య పెరిగిపోతోంది. మాజీ ఎమ్మెల్యే అనిశెట్టి బుల్లబ్బాయిరెడ్డి, పంతం నానాజీ రేసులో ముందున్నారు. వారితో పాటు కడలి ఈశ్వరి, జ్యోతుల వెంకటేశ్వరరావు, ఇతరులు జనసేన అశావాహుల్లో ఉన్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే…పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడిగా ఉన్న కన్నబాబు .. టిక్కెట్‌పై కొండంత ఆశ పెట్టుకున్నారు. దాదాపుగా టికెట్ ఆయనకే ఖాయమని చెప్పవచ్చు. గత ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గానే భారీగా ఓట్లు దక్కించుకున్న తనకు బీసీ, ఎస్సీ వర్గాల్లో బలం పెరిగిందని చెప్పుకుంటున్నారు.
మరోవైపు టీడీపీ తరుపున సిట్టింగ్ ఎమ్మెల్యే బరిలో దిగాలని భావిస్తున్నారు. ఆమె ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ అన్నీ తానై చక్రం తిప్పిన భర్త పిల్లి సత్తిబాబు పోటీకి దిగాలని తహతహలాడుతున్నారు. పిల్లి ఫ్యామిలీకే బాబు టికెట్ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఎవరికి వారే తమకు పట్టుందని చెప్పుకుంటున్నారు. అయితే..ప్రజలు ఎవరి తరపున ఉన్నారో ఓట్లతో సమాధానం చెప్పనున్నారు.