ఛలో కొమురవెల్లి : కొమురవెల్లి మల్లన్న బ్రహ్మోత్సవాలు

  • Published By: madhu ,Published On : January 20, 2019 / 05:21 AM IST
ఛలో కొమురవెల్లి : కొమురవెల్లి మల్లన్న బ్రహ్మోత్సవాలు

సిద్ధిపేట : చేర్యాలలోని కోరమీసాల కొమురవెల్లి మల్లన్న బ్రహ్మోత్సవాలు…ప్రారంభమయ్యాయి…శివసత్తుల సిగాలు, జోగినులు, పోతురాజుల విన్యాసాలు, పూనకాలు, బోనాలు, డప్పు దరువులతో ఆలయ పరిసరాలు సందడిగా మారుతున్నాయి. భక్తులతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోతున్నాయి. బ్రహ్మోత్సవాలకు కొమురవెల్లి పవిత్రపుణ్యక్షేత్రం అందంగా ముస్తాబైంది. జనవరి 20వ తేదీ నుండి 12 ఆదివారాల పాటు ఉత్సవాలు జరుగుతాయి. ఇప్పటికే పలు జిల్లాల నుండి భక్తులు కొమురవెల్లికి చేరుకున్నారు. ఉత్సవాల్లో భాగంగా జనవరి 21వ తేదీ సోమవారం పెద్దపట్నం, అగ్నిగుండాలు జరుగుతాయి. 
పలు ఏర్పాట్లు : 
భారీగా భక్తులు తరలివస్తారనే అంచనాతో ఆలయ ఈవో, సిబ్బంది, పాలక మండలి సభ్యులు అక్కడనే మకాం వేసి పలు ఏర్పాట్లు చేస్తున్నారు. స్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకొనేందుకు వీలుగా ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేశారు. చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. దర్శనం కోసం విశిష్ట దర్శనం, శ్రీఘ్ర దర్శనం, ధర్మ దర్శనం, నజరు, ముఖమండప, చిలుక పట్నాల పేరిట సేవా టికెట్లు విక్రయించనుంది. ఇందుకు 5 ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. కల్యాణ వేదిక వద్ద ప్రత్యేకంగా బారికేడ్లను ఏర్పాటు చేశారు. 
పట్నం వారం : 
కొమురవెల్లి బ్రహ్మోత్సవాల్లో కీలకమైంది ‘పట్నంవారం’. ఈ ఉత్సవంలో భక్తులు ఎక్కువ సంఖ్యలో పాల్గొంటారు. జనవరి 21 సోమవారం జరిగే ఈ ఉత్సవానికి ఆలయ ఈవో, పాలక మండలి సభ్యులు, అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే పలువురు భక్తులు బోనాలతో విచ్చేస్తున్నారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పలువురికి పార్కింగ్ ప్రాంతాలు, చెక్ పోస్టులు, క్యూ లైన్ వద్ద విధులు కేటాయించారు. హైదరాబాద్, సిద్ధిపేట, జనగాం, కరీంనగర్ జిల్లాల నుండి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది.