చంద్రబాబు ఇల్లు ఖాళీ చేయాల్సిందే : మంత్రి బొత్స

  • Published By: madhu ,Published On : September 23, 2019 / 06:49 AM IST
చంద్రబాబు ఇల్లు ఖాళీ చేయాల్సిందే : మంత్రి బొత్స

Updated On : September 23, 2019 / 6:49 AM IST

అక్రమ కట్టడాలపై సీఎం జగన్ ప్రభుత్వం సీరియస్‌గానే ఉంది. CRDA అధికారులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు కూడా. వెంటనే కూల్చివేయకపోతే.. తామే ఆ పని చేస్తామని చెప్పిన అధికారులు రంగంలోకి దిగారు. కృష్ణా నది కరకట్టపై అక్రమ కట్టడాల కూల్చివేత ప్రారంభమైందని మంత్రి బొత్స సత్యనారాయణ సెప్టెంబర్ 23వ తేదీ సోమవారం ప్రకటించారు. నిర్మాణాల కూల్చివేతపై మంత్రి బొత్స 10tvతో మాట్లాడారు.

కరకట్టపై ఉన్న అక్రమ కట్టడాలకు నోటీసులు ఇవ్వడం జరిగిందని, లింగమనేని రమేశ్‌కు సంబంధించిన ఇంటిలో టీడీపీ అధినేత చంద్రబాబు నివాసం ఉంటున్న విషయం తెలిసిందే అన్నారాయన. ఇప్పటికే నోటీసు కూడా ఇచ్చామన్నారు. భూమి హక్కుదారుడితో పాటు అందులో నివాసం ఉంటున్న వారికీ నోటీసు ఇవ్వాలనేది కోర్టు నిబంధన అని వెల్లడించారు మంత్రి. మొండిగా అక్కడే ఉంటున్నారని, ఏడు రోజుల్లో తొలగించాలని.. లేనిపక్షంలో ప్రభుత్వమే తొలగిస్తుందని ఫైనల్ నోటీసు ఇవ్వడం జరిగిందన్నారు. అందులో భాగంగా సోమవారం నుంచి అక్రమ కట్టడాలను అధికారులు, సిబ్బంది కూల్చివేస్తున్నారని వెల్లడించారు. 

కరకట్ట లో-లెవల్ ఏరియాలో ఉంది. నిబంధనల ప్రకారం ఇక్కడ ఉండటానికి వీలు లేదు అని వివరించారు మంత్రి బొత్స. ల్యాండ్ పూలింగ్‌లో తీసుకోవడం జరుగుతుందని, ప్రభుత్వ స్థలం అని చంద్రబాబు గతంలోనే వెల్లడించిన విషయాన్ని గుర్తు చేశారాయన. ల్యాండింగ్ పూల్‌లో భవనం ఇచ్చినట్లు లింగమనేని రమేశ్ చెప్పారని.. ఏది ఏమైనా అది అక్రమ కట్టడం అని తేల్చిన విషయాన్ని వెల్లడించారాయన. 

చంద్రబాబు అక్రమ కట్టడంలో నివాసం ఉండడం మంచిది కాదని హితవు పలికారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి చట్టాలను ఉల్లంఘించడం సరికాదని హితవు పలికారు మంత్రి. ఎంతటి వారైనా, ఎవరైనా సరే అక్రమ కట్టడం ఖాళీ చేయాల్సిందేనని హెచ్చరించారు బొత్స. మరోవైపు గ్రామ సచివాలయాల్లో వస్తున్న విమర్శలపై స్పందించారు మంత్రి బొత్స. పరీక్షల్లో ఎలాంటి తప్పులు జరగేలేదని స్పష్టం చేశారాయన. చంద్రబాబు కావాలనే కుట్ర రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి.