లోకల్ లొల్లి : కాంగ్రెస్‌లో నాగర్ కర్నూలు పంచాయతీ

  • Published By: madhu ,Published On : March 4, 2019 / 04:01 PM IST
లోకల్ లొల్లి : కాంగ్రెస్‌లో నాగర్ కర్నూలు పంచాయతీ

పార్లమెంట్ ఎన్నిక‌ల‌కు స‌న్నద్ధమ‌వుతున్న తెలంగాణ కాంగ్రెస్‌లో ఇప్పుడు లొక‌ల్ లొల్లి సెగ‌లు రేపుతుంది. ఒక‌వైపు పార్లమెంట్‌ ఎన్నికల‌  అభ్యర్థుల కోసం హైక‌మాండ్ క‌స‌ర‌త్తు చేస్తుంటే మ‌రోవైపు నేత‌లు లోక‌ల్ కుంప‌టిని రాజేస్తున్నారు. ముఖ్యంగా రిజ‌ర్వుడ్ పార్లమెంట్ స్థానాలైన పెద్దప‌ల్లి, నాగ‌ర్ క‌ర్నూల్, ఆదిలాబాద్, మ‌హ‌బూబాబాద్, వ‌రంగ‌ల్ స్థానాల‌కు ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. ఇందులో పెద్దప‌ల్లి,నాగ‌ర్ క‌ర్నూల్‌ల‌కు ఒక్కో స్థానానికి 15 మందికి పైగా  ఆశావాహులు పోటీప‌డుతున్నారు. దీంతో ఆ నియోజ‌కవ‌ర్గాల‌లో నాయ‌కులు లోక‌ల్ అస్త్రాన్ని సంధిస్తున్నారు.

ముఖ్యంగా నాగ‌ర్ క‌ర్నూల్ పార్లమెంట్ నియోజ‌క‌వ‌ర్గంలో ఈ లోక‌ల్ లొల్లి మ‌రింత ముదిరింది. ఇప్పటి వ‌ర‌కు నాగ‌ర్ క‌ర్నూల్‌లో ఎంపీలుగా కాంగ్రెస్ నాన్ లోక‌ల్‌కు చెందిన వ్యక్తులే ఉన్నారు. మ‌ల్లు అనంత‌రాములు, మ‌ల్లు ర‌వి,మంద జ‌గ‌న్నాథం, ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ నంది ఎల్లయ్య అంద‌రూ కూడా స్థానికేత‌రులే. అయితే ప్రస్తుతం పోటీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే సంప‌త్, పీసీసీ అధికార ప్రతినిధి స‌తీష్ మాదిగ ఇద్దరు మాత్రం స్థానికులు. అయితే ఈ  నాగ‌ర్ క‌ర్నూల్ లోక‌ల్ పంచాయితీ…చివ‌రికి  గాందీభ‌వ‌న్ కు చేరింది. నాన్ లోక‌ల్ టికెట్ ఇవ్వొద్దంటూ గాంధీభ‌వ‌న్ ముందు ధ‌ర్నాకు దిగారు కార్యక‌ర్తలు.

నాగ‌ర్ క‌ర్నూల్ పార్లమెంట్‌కు స్థానికుడైన మాజీ మంత్రి రాములుకు టీఆర్ఎస్ టికెట్ ను క‌న్ఫామ్‌ చేయ‌డం.. కాంగ్రెస్‌లో లోక‌ల్ పంచాయితీకి ఆజ్యం పోసింది. దీనికి తోడు..ఈ నియోజ‌క‌వ‌ర్గంలో మాలల కంటే..మాదిగ‌ల ఓట్లే ఎక్కువ కావ‌డం.. అందులోను టీఆర్ఎస్ అభ్యర్థి మాదిగ కావ‌డం.. ఈ కుంప‌టిని మ‌రింత రాజేసింది. టికెట్ ఆశావాహుల్లో సంప‌త్ కుమార్, స‌తీష్‌లు స్థానికులు కావ‌డం.. అందులోను మాదిగ నేత‌లు కావ‌డం విశేషం. దీంతో .. ఇప్పుడు పార్టీ గెల‌వాలంటే.. స్థానికుడు.. అందులోను మాదిగ సామాజిక వ‌ర్గానికి చెందిన వ్యక్తికే టికెట్ ఇవ్వాల‌న్న డిమాండ్  ఊపందుకుంది.

టీఆర్ఎస్ లోక‌ల్‌కు టికెట్ ఇస్తుండ‌టంతో.. కాంగ్రెస్ కూడా స్థానికుడికి..అందులోను  మాదిగల్లో ప‌ట్టున్న నేత‌కే టికెట్ ఇవ్వాలంటూ క్యాడ‌ర్ నిర‌స‌న‌ల‌కు దిగుతున్నారు. ఒక‌వైపు  రేపో మాపో.. లోక్ స‌భకు అభ్యర్థుల‌ను ప్రక‌టించేందుకు హైక‌మాండ్ రెడీ అవుతున్న వేళ.. ఇప్పుడు లోక‌ల్ -నాన్ లోక‌ల్ అంశం గాంధీభ‌వ‌న్ కు చేర‌డం.. పార్టీలో టెన్షన్‌ పుట్టిస్తోంది. దీంతో.. నాన్ లోక‌ల్ కు ఇస్తే ఏంటీ.. ఇవ్వక పోతే..ఏంటీ  అన్న విషయాలపై దృష్టి పెడుతుంది అదిష్టానం. మ‌రి ముదిరిన లోక‌ల్ లొల్లికి ఎలా బ్రేకులు వేస్తారో చూడాలి.