జగన్ కి కేసీఆర్ వెయ్యి కోట్ల రూపాయలు సాయం చేశారు :లోకేష్

అమరావతి: ఏపీలో చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమంతో పోటీ పడలేక మోడీ, కేసీఆర్, జగన్ ఒక్కటై కుట్రలు చేస్తున్నారని నారా లోకేష్ విమర్శించారు. టీడీపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆయన మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. జగన్ ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కేసీఆర్ కాళ్ల ముందు తాకట్టు పెట్టాడని, జగన్ కి ఎన్నికల ఖర్చు కోసం వెయ్యి కోట్లు, ప్రచార రధాలు కేసీఆర్ పంపించారని లోకేష్ ఆరోపించారు. కేసీఆర్ కి దమ్ము ఉంటే ఆంధ్రాలో డైరెక్ట్ గా ఎన్నికల ప్రచారం చెయ్యాలి అని ఆయన అన్నారు.
ఆంధ్రులని ఎగతాళి చేసిన వ్యక్తి తో జగన్ పొత్తు పెట్టుకున్నాడని లోకేష్ విమర్శించారు. 31 కేసుల్లో నిందితుడు ఒక్క ఛాన్క్ ఇవ్వమని అడుగుతున్నాడని ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. మంగళగిరి నియోజక వర్గంలోని సమస్యలు అన్నీ పరిష్కరిస్తానని లోకేష్ హామీ ఇచ్చారు. దుగ్గిరాల మండలం లోని రేవేంద్రపాడు గ్రామంలో ప్రచారం నిర్వహిస్తూ లోకేష్ ..ది పెంతెకొస్తు మిషన్ చర్చిలోకి వెళ్లి ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొని…. దైవసేవకులతొ ప్రార్థన చేయించుకున్నారు.