ఊగిసలాటలో మాగుంట : టీడీపీ బుజ్జగింపులు-కన్ఫామ్ చేయని వైసీపీ

ప్రకాశం జిల్లా రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. కొన్నాళ్లుగా ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి వ్యవహారశైలి గందరగోళంగా మారింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళతారని కొన్నాళ్లు.. కాదు జనసేన అంటూ మరికొన్ని రోజులు ప్రచారం జరిగింది. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన వెంటనే.. ఆయన వైసీపీలోకి వెళుతున్నారంటూ వార్తలు వచ్చాయి. విషయం తెలిసిన వెంటనే ప్రకాశం జిల్లా ఇంచార్జి, ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ రంగంలోకి దిగారు. ఆయన ఇంటికెళ్లి చర్చలు జరిపారు. టీడీపీలో సముచిత స్థానం ఇచ్చామని.. పార్టీ మారే ఆలోచన విరమించుకోవాలని కోరారు.
మాగుంటను పార్టీ నుంచి వెళ్లకుండా చేసేందుకు పలువురు నేతలు రాయబారాలు నడుపుతున్నారు. దామరచర్ల జనార్థన్ రెడ్డితోపాటు ఇతర సీనియర్ నేతలు కూడా మాగుంటను సముదాయిస్తున్నారు. మాగుంట డిమాండ్లను పరిష్కరించటానికి సిద్ధం అని హామీ ఇచ్చారు టీడీపీ నేతలు. ఈ చర్చలపై అతని అనుచరులు మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు. ఎంపీ సీటుపై జగన్ క్లారిటీ ఇవ్వనందువల్లనే.. పార్టీ మారేందుకు ఆలస్యం జరుగుతుంది తప్ప.. వైసీపీలోకి వెళ్లటం మాత్రం ఖాయమంటున్నారు.
ఆయన వైసీపీలోకి వెళితే ఒంగోలు ఎంపీ టికెట్ ఇచ్చేందుకు ఆ పార్టీ అధినేత జగన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వటమే మిగిలింది అనే ప్రచారం జరుగుతుంది. నామినేషన్ల దాఖలు గడువు కూడా తరుముకొస్తున్న ఈ టైంలో.. మరికొన్ని గంటల్లో ఈ మాగుంట విషయంపై వైసీపీ ఓ క్లారిటీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.