వినియోగదారుడి విజయం : పట్టుచీర చినిగింది..ఆర్టీసీ పరిహారం

నల్గొండ : మీ బస్సులో వెళితే..పట్టుచీర చిరిగింది..నాకు పరిహారం చెల్లించాల్సిందే…అంటూ కేసు వేసిన ఓ వినియోగదారుడు చివరకు సక్సెస్ అయ్యాడు. ఆర్టీసీ సంస్థ చేత పరిహారాన్ని చెల్లించుకొనేలా చేశాడు. సిబ్బంది నిర్లక్ష్యంతో చీర చినిగిందని భావించిన వినియోగదారుల ఫోరం రవాణా సంస్థకు రూ. 3వేల జరిమాన విధించింది. అసలా ఏంటా సంగతి తెలుసుకోవాలంటే చదవండి…
నల్గొండకు చెందిన నరసింహరావు..వాణిశ్రీ భార్య భర్తలు. వీరిద్దరూ 2018 ఆగస్టు 26న హైదరాబాద్‌లో వివాహానికి వెళ్లేందుకు సూపర్ లగ్జరీ బస్సు (టీఎస్ 05 జెడ్ 0188) ఎక్కారు. అయితే బస్సు ఎంట్రీ వద్ద రేకు తెగింది. దీనికి తగులుకుని వాణిశ్రీ చీర చినిగిపోయింది. ఈ విషయాన్ని బస్సు డ్రైవర్, కండక్టర్‌లకు నరసింహరావు తెలిపాడు. మరో మహిళ చీర కూడా చినిగిపోయింది. రేకును సరిచేస్తే అయిపోతుంది..కదా అని చెబితే..అది మాదు కాదు..ఆర్టీసీ డిపో వారి పని అంటూ సెలవిచ్చారు. డిపో మేనేజర్ దృష్టికి తీసుకెళ్లాడు.
అయినా..నో స్పందన. దీనిని తేలికగా వదులుకోవద్దని..ఆర్టీసీకి తగిన బుద్ధి చెప్పాలని అనుకున్న నరసింహరావు…నల్గొండలోని వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించాడు.
టికెట్ బస్సు..బయటకు తేలిన రేకు..చిరిగిన చీర ఫొటోలను సాక్ష్యంగా సమర్పించారు. విచారణ చేపట్టిన ఫోరం..ఆర్టీసీ లోపం ఉందని నిర్ధారించింది. పట్టు చీరకు రూ. 2వేలు…ఇతర ఖర్చులకు రూ. 1000 జరిమాన ఇవ్వాలని సదరు ఆర్టీసీ సంస్థకు జనవరి 18న ఆదేశించింది.