నలుసే భరించలేం.. : కంట్లో పెద్ద నులిపురుగు

  • Published By: vamsi ,Published On : February 22, 2019 / 04:16 AM IST
నలుసే భరించలేం.. : కంట్లో పెద్ద నులిపురుగు

Updated On : February 22, 2019 / 4:16 AM IST

కంటిలో నులిపురుగు.. మీరు చదివింది నిజమే.. ఓ మహిళ కంటిలో నుంచి సుమారు 15సెం.మీ నులిపురుగు బయటపడింది. సాధారణంగా శుభ్రత పాటించకపోవడం వల్ల, మరికొన్ని కారణాలతో కడుపులో నులిపురుగులు ఏర్పడుతుంటాయి. చిన్నారులలో్ ఇటువంటి సమస్యను ఎక్కువగా మనం గమనిస్తుంటాం. అయితే విశాఖ నగర పరిధిలోని శంకర్‌ ఫౌండేషన్‌ ఆసుపత్రి వైద్యులు బుధవారం అరుదైన శస్త్రచికిత్స నిర్వహించి మహిళ కంటిలో నుంచి నులిపురుగును తొలగించారు. పెందుర్తికి చెందిన బి.భారతి కొద్దిరోజుల క్రితం నుండి కంటినొప్పితో బాధపడుతోంది. స్థానికంగా కొంతమంది వైద్యులను సంప్రదించి మందులు వాడినప్పటికీ కంటినొప్పి నయం కాలేదు. దీంతో కొంతమంది సూచన మేరకు శంకర్‌ ఫౌండేషన్‌ ఆసుపత్రి వైద్యులను ఆమె సంప్రదించారు. కంటికి వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యుడు భువన్ ఆమె కంటి లోపల పురుగు లాంటి జీవి ఉన్నట్టు గుర్తించారు.
    

అయితే స్కానింగ్ రిపోర్టులో మాత్రం అటువంటి పురుగేది కనిపించకపోవడంతో వైద్యులు చికిత్స చేసేందుకు ఇబ్బంది పడ్డారు. స్కానింగ్‌కు ముందు సర్జరీ ద్వారా పురుగును తొలగించాలని భావించిన వైద్యులు.. స్కానింగ్ రిపోర్టులో పురుగు కనిపించకపోవడంతో ఆపరేషన్ వాయిదా వేశారు. అయితే అదే రోజు రాత్రి ఆమె కంటిలో ఏదో కదులుతున్నట్టు అనిపించడంతో వెంటనే ఆసుపత్రికి రాగా డాక్టర్ నజరిన్ వెంటనే శస్త్ర చికిత్స చేసి నులి పురుగును బయటకు తీశారు. వాస్తవానికి మనదేశంలో ఇది అరుదైన శస్త్ర చికిత్సే.. అయితే అమెరికాలో మాత్రం ఇటువంటి ఆపరేషన్ లు చేసినట్లు రికార్డులు ఉన్నాయి. పశువులకు సంబంధించిన పాకల్లో సంచరించినప్పుడు నులి పురుగులు కంట్లోకి చేరే అవకాశం ఉందని డాక్టర్లు అనేకసార్లు అభిప్రాయపడ్డారు.