10 నిమిషాల్లో కరోనా టెస్ట్ : లక్ష కిట్లు దిగుమతి చేసుకున్న ఏపీ ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరితగతిన కరోనా పరీక్షలు నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం లక్ష కోవిడ్ ర్యాపిడ్ కిట్లను దిగుమతి చేసుకుంది. దక్షిణ కొరియాలోని సియోల్ నుంచి ప్రత్యేక చార్టర్ విమానంలో వీటిని తెప్పించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం తాడేపల్లి లోని క్యాంపు కార్యాలయం వీటిని లాంఛనంగా ప్రారంభించారు. ఈ ర్యాపిడ్ కిట్ల ద్వారా కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే కరోనా ఫలితాన్ని గుర్తించవచ్చు.
కొత్తగా లక్ష ర్యాపిడ్ కిట్లు రావడంతో ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పరీక్షలు మరింతగా ఊపందుకోనున్నాయి. ఇన్‌ఫెక్షన్ ఉందా లేదా నిర్ధారించడమే కాకుండా.. ఇన్‌ఫెక్షన్ వచ్చి తగ్గినా సరే ఈ కిట్లు గుర్తించ నున్నాయి. కమ్యూనిటీ టెస్టింగ్ కోసం ర్యాపిడ్ కిట్లను వినియోగిస్తామని అధికారులు తెలిపారు. నాలుగైదు రోజుల్లో అన్ని జిల్లాలకు ఈ కిట్లను పంపించనున్నారు.
ర్యాపిడ్ కిట్లలో ఐజీజీ, ఐజీఎం రెండురకాలు స్ట్రిప్స్ ఉంటాయి. కేవలం బ్లడ్ డ్రాప్స్‌ను ఈ స్ట్రిప్స్‌పై వేస్తారు. తర్వాత కంట్రోల్ సొల్యూషన్ వేస్తారు. 10 నిమిషాల వ్యవధిలో వైరస్ ఉన్నదీ, లేనిదీ చూపిస్తుంది. దక్షిణ కొరియాకు చెందిన ఎస్‌డీ బయోసెన్సార్ కంపెనీ వీటిని ఉత్పత్తిచేస్తోంది. అమెరికా, ఐరోపా లాంటి దేశాలకు కూడా ఎగుమతి చేస్తోంది. ఐసీఎంఆర్ ఇప్పటికే ఈ కిట్లకు ఆమోదం తెలిపింది.
కోవిడ్ –19 నివారణా చర్యల్లో భాగంగా ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికిన చర్యలు చేపట్టింది. కేవలం 2 వారాల వ్యవధిలో విజయవాడ, కాకినాడ, అనంతపూర్, గుంటూరు, కడప, విశాఖపట్నంలలో ల్యాబ్‌లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఈ ల్యాబ్‌ల ద్వారా 2100పైగా టెస్టులను రోజూ చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ర్యాపిడ్ టెస్టు కిట్లతో పరీక్షలు మరింత ఊపందుకుంటాయని, దేశంలోనే తొలి రెండు మూడు స్థానాల్లో నిలుస్తామని అధికారులు చెప్పారు.