తెలుగు హీరోలపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

కొంతకాలంగా మాతృభాష(తెలుగు) పరిరక్షణ గురించి ఫైట్ చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. దూకుడు పెంచారు. తెలుగుని కాపాడుకోవాలని ఆ దిశగా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పవన్ పదే పదే కోరుతున్నారు. తాజాగా మాతృభాషకి సంబంధించి మాట్లాడిన పవన్ తెలుగు హీరోలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మాధ్యమం వివాదంలోకి హీరోలను లాగారు. తెలుగు హీరోలకు తెలుగు రాదు అని పవన్ అన్నారు.
ఇండస్ట్రీలో చాలామంది తెలుగు హీరోలకు తెలుగు చదవడం, రాయడం రాదు అని పవన్ చెప్పారు. సినీ పరిశ్రమలో తెలుగు దిగజారిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు ప్రేక్షకుల ద్వారా డబ్బు అవసరం.. కానీ తెలుగు నేర్చుకోవాలని సినిమాల్లో చాలామందికి లేకపోవడం బాధాకరం అన్నారు. మాతృభాషలో మాట్లాడేందుకు పదాలు వెతుక్కోవాల్సిన పరిస్థితి రావడం దారుణం అన్నారు.
తన మాతృభాష ఇంగ్లీష్ కాదని ఇంటర్ తోనే తాను చదువు ఆపేశాను అని పవన్ చెప్పారు. ప్రభుత్వాలు మాతృభాషను పరిరక్షిస్తాయని అనుకోవడం లేదన్నారు. మన సంస్కృతి, భాషను కాపాడుకునేందుకే నా ప్రయత్నం అని స్పష్టం చేశారు. తిరుపతిలో తెలుగు వైభవం సమావేశంలో పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
తెలుగు హీరోలను ఉద్దేశించి పవన్ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. పవన్ కామెంట్స్ పై డిస్కషన్ జరుగుతోంది. తెలుగు రాని ఆ హీరోలు ఎవరా అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. చాలామంది టాలీవుడ్ హీరోలకు తెలుగు రాదు అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలకు ఆ వైపు నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి.