రైతులను పెయిడ్ ఆర్టిస్ట్‌లు అంటారా?: వైసీపీ నాయకులపై పవన్ ఆగ్రహం

రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు చేపట్టిన నిరసనలకు మద్దతు తెలుపుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజధాని ప్రాంతంలో పర్యటిస్తున్నారు. రైతుల ఆందోళనలు 14వ రోజు కొనసాగుతుండగా.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీనియర్ నేత నాదెండ్ల మనోహర్‌తో పాటు పలువురు పార్టీ నేతలను వెంటబెట్టుకుని నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రైతుల దీక్షకు పవన్ సంఘీభావం తెలిపారు. రైతులకు అభివాదం చేస్తూ ఎర్రబాలెంలో మహిళా రైతుల సమస్యలను విన్నారు.
ఈ సంధర్భంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్.. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని అన్నీ ప్రాంతాల ప్రజలు వేడుకుంటున్నారని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ కూడా అమరావతినే రాజధానిగా ఉంచేందుకు ఒప్పుకున్నారని అన్నారు. అమరావతి రైతులకు న్యాయం జరిగేవరకు జనసేన అండగా ఉంటుందని అన్నారు పవన్ కళ్యాణ్. ఓట్లు పడుతాయని రైతులకు సపోర్ట్ చెయ్యట్లేదని, ఓట్లు కోసం కాకుండా భూమిని నమ్ముకున్న రైతుల కోసం పోరాటం చేస్తానని అన్నారు. రైతులకు అన్యాయం జరిగితే నాకు బాధేస్తుందని అన్నారు.
చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఉండవల్లిలో పోరాడాను అని, భూ సమీకరణ చట్టం చూపెట్టి భయపెట్టి భూములు లాక్కుంటే మాత్రం ఒప్పుకోను అని అప్పుడు చెప్పానని, ఇప్పుడు వైసీపీ నాయకులకు కూడా అదే చెబుతున్నానని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడ? అనే విషయాన్ని వైసీపీ ప్రభుత్వం స్పష్టం చెయ్యాలని అన్నారు. భయపెట్టి, బాధపెట్టి అన్యాయం చేస్తే రైతుల తరపున పోరాటం చెయ్యడానికి నేను ఉన్నాను అని అన్నారు.
హైకోర్టు ఇక్కడ నుంచి కదిలించడం ఎవరి వల్ల కాదని, రాయలసీమ ప్రజలను కూడా వైసీపీ నాయకులు మోసం చేస్తున్నారు అని ఆరోపించారు పవన్ కళ్యాణ్. వారి బుర్రల్లో ఏముంది? అనేది వైసీపీ నాయకులు ఎందుకు చెప్పట్లేదని ప్రశ్నించారు. రాజధాని ప్రాంతంలో నిరసన చేస్తుంటే పెయిడ్ ఆర్టిస్ట్‌లు అంటారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షమకు అర్హం లేని పదాలు వాడి వారిని బాధపెట్టారని, రైతులను కన్నీరు పెట్టించిన ప్రభుత్వాలు బాగుపడవు అని అన్నారు పవన్ కళ్యాణ్.