పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
ప్రకాశం : జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజారాజ్యం పార్టీ (పీఆర్పీ)ఆవిర్భావంలో కీలక పాత్ర పోషించానని తెలిపారు. పీఆర్పీ పెట్టడానికి చిరంజీవికి ప్రేరణ కలిగించిన వారిలో తాను కూడా ఒకడినని పేర్కొన్నారు. ప్రజారాజ్యం అధికారంలోకి వస్తే సామాజిక న్యాయ జరిగేదని..పార్టీలో ఓపిక లేని నాయకుల వల్లే ఆ అవకాశం చేజారిందన్నారు. ఆనాడు పదవీ వ్యామోహంతో పీఆర్పీలోకి వచ్చిన నేతలంతా చిరంజీవిని బలహీనుడిగా మార్చేశారని ఆరోపించారు. ప్రకాశం జిల్లా జనసేన నేతలు, కార్యకర్తలతో ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో బరిలో నిలిచేది 60 శాతం మంది కొత్త అభ్యర్థులేనని తెలిపారు.
రాష్ట్ర రాజకీయాల్లో సమతుల్యత కోసమే అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నామని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో 175 సీట్లకు గానూ 60 చోట్ల కొత్త వ్యక్తులను బరిలో నిలుపుతామని ప్రకటించారు.’యువతను నమ్మి నేను పార్టీ పేట్టాను..వారే నా వెన్నెముక’ అని అన్నారు. పీఆర్పీకి ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని జనసేనలో ఎలాంటి కమిటీలను నియమించలేదని స్పష్టం చేశారు. జనసేన నిర్మాణంలో ఆచితూచి ముందుకెళ్తున్నామని తెలిపారు. ప్రస్తుతం ఎన్నికల్లో పోటీ చేయాలంటే రూ.2000 కోట్లు ఖర్చు పెట్టాలని కొందరు అంటున్నారని వెల్లడించారు. సినిమాలో నటన తనకు సంతృప్తి ఇవ్వలేదన్నారు.