టీడీపీకి పులివెందుల సతీష్ రెడ్డి రాజీనామా!

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం పులివెందుల నుంచి టీడీపీ తరపున కీలక నేతగా ఉన్న సతీష్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధం అయ్యారు. వేంపల్లెలోని తన నివాసంలో ముఖ్య వర్గీయులతో సమావేశం అయిన సతీష్ కుమార్ రెడ్డి.. టీడీపీని వీడుతున్నట్లు సతీష్ స్పష్టం చేశారు. దశాబ్దాలుగా వైఎస్ కుటుంబంతో తలపడుతున్నా కూడా తెలుగుదేశం పార్టీ నుంచి సరైన ఆదరణ లభించలేదనే కారణంగా పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
దశాబ్దాలుగా వైఎస్ కుటుంబంతో నియోజకవర్గంలో పోరాడుతున్నా కూడా సరైన ప్రాధాన్యత దక్కలేదని, మనసును చంపుకొని తెలుగుదేశం పార్టీలో ఉండేలేకపోతున్నానని ఆయన అన్నారు. టీడీపీపై అసంతృప్తితోనే ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వర్గీయులకు, కార్యకర్తలకు సతీష్ రెడ్డి తెలిపారు. కడపలో టీడీపీకి చాలా కీలకనేతగా సతీష్ ఎన్నో రోజులుగా వ్యవహరిస్తున్నారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై రెండుసార్లు, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై రెండుసార్లు సతీష్ రెడ్డి పులివెందుల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేశారు. వారి చేతిలో ఓటమి పాలైనప్పటికీ.. సతీష్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. అయితే ఇప్పుడు ఆయన పార్టీ నుంచి తప్పుకున్నారు.
See Also | భారత్‌లో మరో 9 కరోనా కొత్త కేసులు..