ఉపాధి కోసం వెళ్తే : ఆదివాసీలను అమ్మేస్తున్నారు

ఉపాధి కోసం పొట్ట చేతపట్టుకుని ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా నుంచి వలస వచ్చిన కూలీలను దళారులు అంగడి సరకులా అమ్మేస్తున్నారు.

  • Published By: veegamteam ,Published On : February 12, 2019 / 03:43 PM IST
ఉపాధి కోసం వెళ్తే : ఆదివాసీలను అమ్మేస్తున్నారు

ఉపాధి కోసం పొట్ట చేతపట్టుకుని ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా నుంచి వలస వచ్చిన కూలీలను దళారులు అంగడి సరకులా అమ్మేస్తున్నారు.

భద్రాద్రి కొత్తగూడెం : ఉపాధి కోసం పొట్ట చేతపట్టుకుని ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా నుంచి వలస వచ్చిన కూలీలను దళారులు అంగడి సరకులా అమ్మేస్తున్నారు. పని చూపిస్తామని అమాయకులను నమ్మించి కాంట్రాక్టర్లకు అప్పగిస్తున్నారు. కాంట్రాక్టర్లు వారితో వెట్టి చాకిరీ చేయిస్తున్నారు. చేసిన పనికి సరైన వేతనం కూడా ఇవ్వకపోడంతో దోపిడీకి గురువుతున్నారు. దళారులు, కాంట్రాక్టర్ల చేతుల్లో దగాకు గురవుతున్న వలస కూలీలపై ప్రత్యేక కథనం.
                                
ఉన్న ఊరిలో ఉపాధి లేదు. ఓ వైపు మావోయిస్టులు, మరోవైపు పోలీసుల భయం. ఎవరు ఎప్పుడు  ఎలా విరుచుకుపడతారో తెలియని  పరిస్థితి. ఇరువర్గాల మధ్య జరుగుతున్న ఆధిపత్యపోరులో నలిగిపోతున్న ఛత్తీస్‌గఢ్‌, ఒడిశాల్లోని గిరిజనులు.. బతికి ఉంటే బలుసాకైనా తిని బతకొచ్చన ఉద్దేశంతో పెట్టేబేడ సర్దుకుని, పిల్లాజల్లను వెంటపెట్టుకుని  భద్రాచలం ఏజెన్సీకి వలస వస్తున్నారు.  ఇక్కడకు వచ్చిన గిరిజనులు దళారుల చేతుల్లో చిక్కుకుని దారుణంగా మోసపోతున్నారు. 

ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా నుంచి వలస వచ్చిన ఆదివాసీల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని… దళారులు మాయమాటలు చెప్పి నమ్మిస్తున్నారు. హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరులో పని చూపిస్తామంటూ ఆశ చూపిస్తున్నారు. రోజుకు 500 రూపాయల కూలీతోపాటు వసతి ఉచితమంటూ నమ్మబలుకుతారు. పొట్టకూటి కోసం వచ్చిన కూలీలు.. దళారుల మాయమాటలు నమ్మి పనికి ఒప్పుకుంటున్నారు. దళారులు మహానగరాల్లోని కాంట్రాక్టర్లతో ముందుగానే  ఒప్పందాలు కుదుర్చుకుని వారి ఫోన్‌ నంబర్లు ఇచ్చి బస్సులు ఎక్కించి  పంపిస్తున్నారు. కూలీలు పనిలో చేరిన వెంటనే కాంట్రాక్టర్ల… దళారుల బ్యాంక్‌ అకౌంట్లలో డబ్బు జమచేస్తున్నారు. ఒక్కో కూలీకి 7 వేల రూపాయల నుంచి 10 వేల రూపాయల వరకు అకౌంట్‌లో  పడుతోంది. ఇలాంటి దళారులు భద్రాచలంలో వంద మంది వరకు ఉన్నారు. 

పనిలో చేరిన కూలీలకు కాంట్రాక్టర్లు చుక్కలు చూపిస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వెట్టి చాకిరీ చేయిస్తూ శ్రమ దోపిడీ చేస్తున్నారు. దళారులు చెప్పినట్టుగా కూలి ఇవ్వరు.  వసతీ కల్పించారు. రేపు, మాపు, ఇదిగో అదిగో అంటూ కాలం గడుపుతారు.   కాంట్రాక్టర్లు ఇచ్చింది తీసుకుని చెట్లు, పుట్టల నీడలో తలదాచుకోవాల్సిన దయనీయ పరిస్థితులు ఉన్నాయి. రోగాలు, రొష్టులు వచ్చినా గొడ్డు చాకిరీ తప్పదు.  కొందరు కాంట్రాక్టర్లైతే  నెలల తరబడి పనిచేయించుకుని డబ్బులు ఇవ్వకుండా  వెళ్లగొడుతున్నారు… మరికొందరు దళారులు మహిళా కూలీలను వ్యభిచారం రొంపితో దింపుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. పోలీసు, కార్మిక అధికారులు పట్టించుకుని ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా నుంచి వస్తున్న కూలీలు దళారుల చేతుల్లో చిక్కుకుని మోస పోకుండా చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల నాయకులు కోరుతున్నారు.