స్కూల్స్ తెరిచినా పిల్లల్ని స్కూల్స్ కు పంపించం అంటున్న తల్లిదండ్రులు

స్కూళ్లు, విద్యాసంస్థలను సెప్టెంబర్ 1 నుంచి నవంబర్ 14 వరకు దశల వారీగా రీ-ఓపెన్ చేసేందుకు కేంద్రం మార్గదర్శకాలను సిద్దం చేసింది. కరోనా సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రణాళికలపై ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ నేతృత్వంలో ఉన్నత కార్యదర్శుల బృందం కీలక విషయాలను చర్చించారు. ఈ నిర్ణయాన్ని కేంద్రం ఆగస్టు 31 తర్వాత చివరిదశ అన్‌లాక్ ప్రక్రియలో భాగంగా రాష్ట్రాలకు వెల్లడించనుంది. అలాగే విద్యార్థులను క్లాసులకు పంపించాలా.? లేదా.? అనే అంశాలపై తుది నిర్ణయాన్ని పూర్తిగా రాష్ట్రాలకే వదిలేసింది.
ఈ క్రమంలో స్కూల్స్ తెరిచినా విద్యార్ధులను స్కూళ్లకు పంపించేందుకు తల్లిదండ్రులు ఇష్టపడుతున్నారా? లేదా? అనే అంశంపై నిర్వహించిన సర్వేలో పలు విషయాలు వెల్లడయ్యాయి. ఇప్పట్లో స్కూల్స్ తెరుచుకున్నా పిల్లలను స్కూళ్లకు పంపించటానికి సిద్ధంగా లేరని ఓ సర్వేలో తేలింది. 62% తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలల్లో తరగతులకు హాజరుకావడానికి ఇష్టపడలేదని ..కేవలం 6 శాతంమంది మాత్రమే తమ పిల్లలకు స్కూల్స్ కు పంపించటానికి సిద్ధంగా ఉన్నారనీ..విద్యార్దులకు కూడా అంతే శాతంగా ఇష్టపడుతున్నారని తేలింది.
భారత్ ప్రస్తుతం అన్‌లాక్ మూడవ దశలో ఉంది. నాల్గవ దశ సెప్టెంబర్ 1 నుండి ప్రారంభం కానుంది, కాని ప్రభుత్వం ఇంకా దీనికి మార్గదర్శకాలను ప్రకటించలేదు. మూడవ దశ లాక్డౌన్ కింద, విద్యాసంస్థలు, స్థానిక రైళ్లు, మెట్రో సర్వీసులు మరియు సినిమా హాళ్ళను తెరవడానికి అనుమతించలేదు. జిమ్‌లు, హోటళ్లు, రెస్టారెంట్లు మూడో దశలో ప్రారంభించడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
ఈక్రమంలో 261 జిల్లాల్లో 25 వేల మంది స్పందన ఆధారంగా ఈ సర్వే లో నామ మాత్రంగా మాత్రమే తమ పిల్లలకు స్కూళ్లకు పంపించటానికి సిద్ధంగా ఉన్నారని తేలింది. పాఠశాలలను ఎప్పుడు తెరవాలన్న తల్లిదండ్రుల అభిప్రాయాలను పంపాలంటూ ఇటీవల కేంద్రం అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను ఆదేశించింది. దీంతో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు తల్లిదండ్రుల అభిప్రాయాలను సేకరించి పంపాయి. దాదాపు అన్ని రాష్ట్రాలు బడులు ఇప్పట్లో తెరవడం సురక్షితం కాదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసాయి.
కాగా..జూలైలో పాఠశాల విద్యాశాఖ నిర్వహించిన సమగ్ర సర్వేలోనూ ఈ ఎస్ఓపీలనే ప్రస్తావించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలకు పంపించడానికి అనుకూలంగా లేరని ఆ సర్వే సూచించినప్పటికీ, బలహీన వర్గాల విద్యార్థులు ఆర్థికంగా బాధపడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం దృష్టికి తీసుకెళ్లాయి. ఇక కరోనా కేసులు తక్కువగా ఉన్న రాష్ట్రాలు సీనియర్ తరగతుల విద్యార్ధులకు తిరిగి క్లాసులు ప్రారంభించాలని ఆసక్తి చూపిస్తున్నట్లు సర్వేలో తేలింది.
కరోనా వైరస్ తగ్గుముఖం పట్టడంతో ప్రయోగాత్మక పద్ధతిన ఢిల్లీలో మెట్రో రైలు సేవలను పునరుద్ధరించే అవకాశం ఉందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. మెట్రో రైళ్ల రాకపోకల పునరుద్ధరణపై కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ఓ నిర్ణయం తీసుకోవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. డిజిటల్ సంవాద్ పేరుతో నగర వ్యాపారులు, పారిశ్రామికవేత్తలతో ఆదివారం (ఆగస్టు 23, 2020) కేజ్రీవాల్ మాట్లాడుతూ మెట్రో రైళ్ల పునరుద్ధరణపై కేంద్ర ప్రభుత్వంతో పలుమార్లు ప్రస్తావించామని తెలిపారు. దీనిపై త్వరలో నిర్ణయం వెలువడుతుందని అన్నారు.
ఢిల్లీలో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టడంతో ఇతర నగరాల్లో మెట్రో సర్వీసులను పునరుద్ధరించకున్నా ఢిల్లీలో మాత్రం ప్రయోగాత్మకంగా మెట్రో రైళ్లను అనుమతించాలని కోరారు. దశలవారీగా మెట్రో సర్వీసులను సాధారణ స్థితికి తీసుకురావొచ్చని సూచించారు. చాందినీచౌక్ అభివృద్ధి ప్రాజెక్టు తరహాలో ఢిల్లీలో రోడ్లు, మార్కెట్లను సుందరీకరిస్తామని కేజ్రీవాల్ చెప్పారు.
కాగా..సినిమా థియేటర్లు తెరుచుకున్నాగానీ..కరోనా ఉదృతి వల్ల ప్రజలు థియేటర్లకు వెళ్లి సినిమా చూడటానికి ఆసక్తి చూపించటంలేదనీ..భయపడుతున్నట్లుగా తెలుస్తోంది.77 శాతం మంది సురక్షితంగా ఉండాలంటే థియేటర్లకు వెళ్లటం మంచిదికాదని చెబుతున్నారు.14 శాతం మంది అస్సులు థియేటర్లకు వెళ్లవద్దని సూచిస్తున్నారని సర్వేలో తేలింది.