నెల్లూరు టీడీపీలో గందరగోళం : అంతుచిక్కని ఆదాల ఆంతర్యం

  • Published By: madhu ,Published On : February 7, 2019 / 04:05 PM IST
నెల్లూరు టీడీపీలో గందరగోళం : అంతుచిక్కని ఆదాల ఆంతర్యం

Updated On : February 7, 2019 / 4:05 PM IST

నెల్లూరు : ఆయనో సీనియర్‌ పొలిటీషియన్‌. ఈ ఎన్నికల్లో ఆయన పోటీ చేసే స్ధానాన్ని బట్టే .. మిగతా ఆశావహుల భవితవ్యం తేలనుంది. కానీ ఆయన మాత్రం తన మనసులో మాట బయటపెట్టడం లేదు. చివరికి అసెంబ్లీకా..? పార్లమెంటుకా.. అన్న విషయాన్ని కూడా తేల్చడం లేదు. దీంతో జిల్లాలో టీడీపీ రాజకీయాలన్నీ ఇప్పుడు ఆయన చుట్టూనే తిరుగుతున్నాయి. మరి ఎవరాయన అనుకుంటున్నారా..? 

నెల్లూరు జిల్లాలో ఆదాల ప్రభాకర్ రెడ్డి ఓ సీనియర్ పొలిటీషియన్. జిల్లా రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. గతంలో టీడీపీలో మంత్రిగా పనిచేసిన ఆదాల ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. రాష్ట్ర విభజన తర్వాత మళ్లీ తిరిగి టీడీపీ గూటికి చేరారు. గత ఎన్నికల్లో నెల్లూరు పార్లమెంటు స్థానానికి పోటీ చేసి స్వల్ప తేడాతో పరాజయం పాలయ్యారు. ప్రస్తుతం నెల్లూరు పార్లమెంటు, రూరల్ నియోజకవర్గ ఇంఛార్జిగా కొనసాగుతున్న ఆదాల చుట్టూ జిల్లా టీడీపీ రాజకీయాలు తిరుగుతున్నాయి.  

ఆదాలను తొలి నుంచీ నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గం నుంచి బరిలోకి దింపాలని టీడీపీ అధిష్టానం భావిస్తోంది. అయితే జిల్లా టీడీపీలో ఉన్న వర్గ విభేదాలను దృష్టిలో పెట్టుకుని దీనికి తొలుత ఆదాల విముఖత చూపించారు. అయితే.. పార్లమెంటు నియోజవర్గ పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో తాను ఎంపిక చేసిన అభ్యర్ధులను బరిలోకి దించితే సిద్ధమని సీఎం ముందు ప్రతిపాదించారు. దీనికి ఆయన అంగీకరించడంలో తొలుత నేతల మధ్య విభేధాలు తొలగించే ప్రయత్నాలు మొదలు పెట్టారు. అది సాద్యం కాలేదు. ఆత్మకూరులో మాజీ ఎమ్మెల్యే  బొల్లినేని కృష్ణయ్యను ఎమ్మెల్యే అభ్యర్ధిగా ప్రకటించడం, బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డిని టీడీపీలోకి తీసుకురావడం మినహా ఏమీ చేయలేకపోయారు. 

మొదట్లో పార్లమెంటుకు పోటీ చేసేందుకు విముఖత 
7 అసెంబ్లీ స్థానాల్లో గెలిచే అభ్యర్ధులను ఎంపిక చేసే బాధ్యత
మాజీ ఎమ్మెల్యే  బొల్లినేని కృష్ణయ్య నాయుడు
బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డిని టీడీపీలోకి తీసుకురావడం 
సోమిరెడ్డి, ఆదాలకు మధ్య అంతర్గతపోరు 
మంత్రి నారాయణ నెల్లూరు సిటీకే పరిమితం
జిల్లా అధ్యక్షుడు బీదా రవిచంద్ర 

ఆదాల నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇంఛార్జిగా కొనసాగుతున్నా..అక్కడ్నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపడంలేదు. ఎందుకంటే .. ఆదాల, సోమిరెడ్డి ఎన్నోఏళ్లుగా రాజకీయ శత్రువులు. రూరల్‌లో సోమిరెడ్డికి కొంత పట్టుంది. ఇక్కడ్నుంచి తన సన్నిహితుడు పెళ్లకూరు శ్రీనివాసులను పోటీ చేయించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే నియోజకవర్గానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితోనూ మంచి సంబంధాలున్నాయి. ఒకవేళ రూరల్‌ నుంచి పోటీ చేస్తే సోమిరెడ్డి తనను ఓడించేందుకు కుట్ర చేస్తారనేది ఆదాల అనుమానం. ఒకవేళ టీడీపీ మళ్లీ అధికారంలోకి వచ్చి ఆదాల కూడా గెలిస్తే.. ఆయన ఖచ్చితంగా మంత్రి పదవి రేసులో ఉండే అవకాశం ఉంది. కోవూరు, కావలి నియోజకవర్గాల్లో ఆదాలకు బంధుత్వాలు, మంచి సంబంధాలు, సన్నిహితులు, కేడర్ ఉండడంతో వీటిలో ఏదో ఒక చోట నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు. ముఖ్యంగా కోవూరుపై ఆశలు పెట్టుకున్నారు. 

ఆదాల, సోమిరెడ్డి రాజకీయ శత్రువులు
రూరల్ నియోజకవర్గంలో సోమిరెడ్డికి పట్టు
పెళ్లకూరు శ్రీనివాసులను పోటీ చేయించే ప్రయత్నం

ప్రస్తుతం కోవూరు నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా కోవూరు నుంచి తనే పోటీ చేయాలని ఆశిస్తున్నారు. ప్రజల్లో తనపై వ్యతిరేకత ఉన్నప్పటికీ తన పని తాను చేసుకుపోతూ ఎన్నికలకు సిద్దమవుతున్నారు. మరోవైపు సిఎం చంద్రబాబే స్వయంగా టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేల మనోభావాలను దెబ్బతీయకూడదనడంతో పోలంరెడ్డిని మార్చే పరిస్థితి కనిపించడంలేదు. టీడీపీ ఎమ్మెల్యేగా పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి కోవూరు నుంచి టికెట్ ఆశిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆదాల ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ఎక్కడ్నుంచి పోటీ చేస్తారన్న దానిపై క్లారిటీకి రాలేకపోతున్నారు. ఫలితంగా మిగతా స్థానాల్లోనూ స్సష్టత రావడం లేదు.

అటు మంత్రి నారాయణ, జిల్లా అధ్యక్షుడు బీదా రవిచంద్ర పలుమార్లు తన నివాసంలోనే ఆదాలతో భేటీ అయ్యి నెల్లూరు రూరల్ నుంచి పోటీ చేయమని ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. ఆదాల మాత్రం స్పష్టతనివ్వకపోగా సిఎం చంద్రబాబు దగ్గరే తన అభిప్రాయం చెప్తాననడంతో ఆ ఇద్దరు నాయకులు వెనుదిరిగారన్న చర్చ రాజకీయవర్గాల్లో సాగుతోంది. మరోవైపు.. అసలు ఆదాల ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తారా ? ఎన్నికలకు దూరంగా ఉంటారా ? అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఏదిఏమైనా వీటన్నిటిపైనా క్లారిటీ రావాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయకతప్పదు.