అకాల వర్షం అపార నష్టం : భూపాలపల్లి రైతన్న విలవిల

  • Published By: madhu ,Published On : January 27, 2019 / 12:10 PM IST
అకాల వర్షం అపార నష్టం : భూపాలపల్లి రైతన్న విలవిల

జయశంకర్ భూపాలపల్లి : అకాల వర్షాలు రైతన్న నడ్డి విరిచాయి. ఇప్పటికే నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న రైతన్నను వర్షాలు మరింత నష్టాల ఊబిలోకి నెట్టాయి. జనవరి 26వ తేదీ శనివారం కురిసిన వర్షానికి భూపాలపల్లి నియోజకవర్గంలో గణపురం(ము)మండలం బస్వరాజు పల్లి గ్రామంలో రైతులు ఆరు గాలం కష్టపడి పండించిన మిర్చి రైతులు మిర్చిని ఎండబోయగా వర్షానికి తడిసి చేతికి అందకుండా పోయిందని రైతు రాజేశ్వర్ రావు వాపోయారు. ఇప్పటి కైనా జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వం దృష్టికి తీసుకెల్లి ఎకరానికి మిర్చికి రూ.50 వేలు పత్తికి ఎకరానికి రూ.5వేలు ఇప్పించి రైతులను ఆదుకోవాలని రాజేశ్వర్ రావు కోరారు.

మహాదేవపూర్, కాటారం, మహాముత్తారం, మల్హర్ పల్లి, పలిమేల మండలంలో జనవరి 26వ తేదీ శనివారం రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి వందల ఎకరాల్లో పత్తి, మిర్చి పంటలు దెబ్బతిన్నాయి. ఇప్పటికే రైతులు 75 శాతం పత్తి సేకరించగా చివరి దశలో మిగిలి ఉంది. అకాల వర్షంతో తడిసిన పత్తి రంగు మారి నాణ్యత దెబ్బతింటుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు మిరప రైతులకు కూడా వర్షం నష్టం కలిగించింది. మిర్చి చెట్లు వర్షానికి విరిగి పోయాయి. చేతికందిన మిర్చి నేల రాలింది. ప్రభుత్వం పంట పంటను పరిశీలించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని రైతులు వేడుకుంటున్నారు.