యువోత్సాహం : TDP జాబితాలో 11 మంది వారసులకు చోటు

  • Published By: madhu ,Published On : March 15, 2019 / 01:48 AM IST
యువోత్సాహం : TDP జాబితాలో 11 మంది వారసులకు చోటు

TDP పార్టీలో వారసులు రాజకీయాల్లోకి రంగప్రవేశం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న టీడీపీ అభ్యర్థుల్లో 11 మంది వారసులకు చోటు దక్కింది. వీరంతా మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నవారే. ఇంతకు ఆ వారసులు ఎవరు?

1 ) శ్రీకాకుళం జిల్లాలోని పలాస నుంచి గత ఎన్నికల్లో గౌతు శివాజీ పోటీ చేసి గెలిచారు. ఈ ఎన్నికల్లో ఆయన కూతురు గౌతు శిరీషకు చోటు దక్కింది. గౌతు శివాజీ పోటీ నుంచి తప్పుకోవడంతో ఆయన కూతురుకు చంద్రబాబు టికెట్‌ ఖరారు చేశారు.
2 ) విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి గత ఎన్నికల్లో బొత్స సత్యనారాయణపై కిమిడి మృణాళిని పోటీ చేసి గెలుపొంది మంత్రి పదవి దక్కించుకున్నారు. ఈసారి ఆమె ఎన్నికల్లో పోటీ చేయబోనని, తన కుమారుడికి టికెట్‌ ఇవ్వాలని చంద్రబాబును కోరారు. దీంతో బాబు ఆమె కుమారుడు కిమిడి నాగార్జునకు టికెట్‌ కన్ఫాం చేశారు.
3 ) రాజమండ్రి అర్బన్‌ నుంచి ఎర్రన్నాయుడు కుమార్తె, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు కోడలు ఆదిరెడ్డి భవానీ రాజమండ్రి అర్బన్‌ నుంచి పోటీ చేయనున్నారు.
Read Also: అక్కడ ఎంపీని డిసైడ్ చేసేది మహిళలే

4 ) కృష్ణా జిల్లా గుడివాడ నుంచి చంద్రబాబు దేవినేని అవినాశ్‌కు అవకాశం కల్పించారు. దేవినేని నెహ్రూ కుమారుడే దేవినేని అవినాశ్‌. 2014 ఎన్నికల్లో అవినాశ్‌… కాంగ్రెస్‌ తరపున విజయవాడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత టీడీపీలో చేరారు.
5 ) విజయవాడ వెస్ట్‌ నుంచి గత ఎన్నికల్లో జలీల్‌ఖాన్‌ ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పడు ఇదే స్థానంలో ఆయన కూతురు పోటీ చేయబోతున్నారు. చంద్రబాబు జలీల్‌ఖాన్‌ కూతురు షబానా ఖాతూర్‌కు టికెట్ ఖరారు చేశారు. 
6 )  మంగళగిరి నుంచి నారా లోకేష్‌ పోటీకి దిగుతున్నారు. నారా లోకేష్‌ ఇప్పటికే మంత్రిగా కూడా పని చేస్తున్నారు. అయితే ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. కానీ ఎమ్మెల్యేగా పోటీ చేయలేదు. అసెంబ్లీకి ఆయన మొట్టమొదటి సారి పోటీ చేయబోతున్నారు.
7 )  ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తనయుడు కేఈ శ్యామ్‌ పత్తికొండ అసెంబ్లీ బరిలో అదృష్టాన్ని తేల్చుకోనున్నారు.
8 ) రాప్తాడు నుంచి పరిటాల శ్రీరామ్‌ పోటీకి దిగుతున్నారు. రాప్తాడు నుంచి గత ఎన్నికల్లో పరిటాల సునీత పోటీ చేసి గెలుపొంది మంత్రి పదవి దక్కించుకున్నారు. ఈసారి తన కుమారుడికి పోటీ చేసే అవకాశం ఇవ్వాలని పరిటాల సునీత కోరడం..బాబు ఒకే చెప్పారు. పరిటాల శ్రీరామ్‌ ఎన్నికల బరిలో నిలిచారు. 
9 ) చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తీ నుంచి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి పోటీ చేసి గెలిచారు. మంత్రిగా కూడా పని చేశారు. అయితే వయస్సు మీద పడడంతో రాజకీయాల నుండి తప్పుకున్నారు. ఎన్నికల్లో తన కుమారుడికి టికెట్ కేటాయించాలని కోరడంతో బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. బొజ్జల కుమారుడు సుధీర్‌రెడ్డికి చంద్రబాబు టికెట్‌ ఖరారు చేశారు.
10 ) చిత్తూరు జిల్లాలోని నగరి నుంచి గాలి ముద్దు కృష్ణమనాయుడు తనయుడు గాలి భాను ప్రకాశ్‌రెడ్డి పోటీ చేయనున్నారు.
11 ) విశాఖ జిల్లా అరకు నుంచి కిడారి సర్వేశ్వర్‌రావు తనయుడు శ్రావణ్‌కుమార్‌ పోటీకి దిగబోతున్నారు.
మొత్తానికి టీడీపీ మొదటి జాబితాలో 11మంది వారసులు రాజకీయ రంగప్రవేశం చేయబోతున్నారు. వీరిలో ఎవరు విజయం సాధిస్తారో.. ఎవరు పరాజయం పాలవుతారో చూడాలి.
Read Also: 2.5లక్షల మంది : కేసీఆర్ సభకు పోటెత్తనున్న జనం