రైల్వే ప్రాజెక్టులు ఇవ్వనప్పుడు సమావేశాలు ఎందుకు..ఎంపీ కేశినేని నాని ఫైర్

విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని రైల్వే శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తూతూ మంత్రంగా సమావేశాలు నిర్వహించడం కాదని రాష్ట్రానికి ప్రాజెక్టులు ఇవ్వాలని ఆయన మండిపడ్డారు. మంగళవారం, సెప్టెంబర్ 24న విజయవాడలో రైల్వే జీఎంతో ఎంపీల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన నాని రైల్వే శాఖ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త రైళ్లు, కొత్త లైన్లు అడిగినా ఇవ్వలేదంటూ సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఎన్నో ప్రాజెక్టులు అడిగామని ఒక్కటి కూడా ఇవ్వలేదంటూ ఆయన ఆవేశంగా మాట్లాడారు.
విశాఖపట్నం రైల్వేజోన్ పరిధి తగ్గించంట పట్ల కూడా ఎంపీ కేశినేనినాని అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతరం సమావేశాన్ని బాయ్ కాట్ చేస్తున్నట్లు ప్రకటించారు. సమావేశం నుంచి అర్థాంతరంగా బయటకు వచ్చేశారు. సమావేశంలో ఉండాలని అధికారులు కోరినప్పటికీ ఎంపీ కేశినేని నాని మాత్రం ససేమిరా అంటూ బయటకు వచ్చేశారు.
విజయవాడలో పార్లమెంట్ సభ్యులతో రైల్వే జీఎం గజానన్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధి లోని ఎంపీలు అందరినీ ఆహ్వనించారు. విజయవాడ గుంటూరు తెనాలి మధ్య సర్కులర్ రైళ్ల ఏర్పాటు…విజయవాడ డివిజన్ లో కోచింగ్ డిపో ఏర్పాటులో నిర్లక్ష్యం…దక్షిణ కోస్తా రైల్వే జోన్ అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలు…తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. కాగా సమావేశానికి ముందే ఎంపీ కేశినేని నాని బాయ్ కాట్ చేసి బయటకు వచ్చేశారు.