తిరుమలకు వెళ్లే భక్తులకు గమనిక : శ్రీవారి దర్శనం రద్దు

తిరుమల శ్రీవారి ఆలయంలో దర్శనాన్ని రద్దు చేశారు TTD అధికారులు. ఆలయంలో అష్టబంధన బాలాలయ మహా సంప్రోక్షణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 27వ తేదీ శనివారం ఉదయం 11గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు దర్శనం ఉండదని టీటీడీ తెలిపింది. ఆలయంలో ఐదు రోజులుగా అష్టబంధన బాలాలయ కార్యక్రమాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 26వ తేదీ శుక్రవారం యాగశాలలో వైదిక కార్యక్రమాలను వేద పండితులు నిర్వహించారు.
మధ్యాహ్నం సమయంలో వరహాస్వామికి మహాశాంతి పూర్ణాహుతి, మహాశాంతి తిరుమంజనం నిర్వహించారు. ఇది సాయంత్రం 6 గంటల వరకు జరిగింది. రాత్రి 8 నుండి 10 గంటల వరకు శయానాధివాసం చేపట్టారు. ఏప్రిల్ 27వ తేదీ శనివారం ఉదయం 10 నుండి 11 గంటల వరకు మహా పూర్ణాహుతి నిర్వహించనున్నారు. మహాసంప్రోక్షణలో భాగంగా యాగశాలంలో కుంభంలో ఉన్న దేవతామూర్తుల శక్తిని విగ్రహంలోకి ఆవాహన చేస్తారు. ఈ కార్యక్రమాలన్నీ పూర్తయిన తర్వాత భక్తులకు దర్శనానికి అనుమతినిస్తారు. శ్రీవారి భక్తులు గమనించి తమ దర్శన సమయాన్ని ముందుగా నిర్ణయించుకోవాలని టిటిడి విజ్ఞప్తి చేసింది.
మరోవైపు తిరుమలలో వేసవి సెలవుల రద్దీ విపరీతంగా ఉంది. భక్తులు భారీగా వస్తున్నారు. దీంతో ఏప్రిల్ 15వ తేదీ నుంచి జూలై 15వ తేదీ వరకు వారాంతపు రోజులైన శుక్ర, శని, ఆదివారాల్లో మూడు రోజులు విఐపి బ్రేక్ దర్శనాలు ఉండవని టీటీడీ వెల్లడించింది.