నమో వెంకటేశాయ : ధర్మకర్తల మండలి సభ్యుల ప్రమాణ స్వీకారం

టీటీడీ నూతన ధర్మకర్తల మండలి సభ్యులు తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రమాణస్వీకారం చేశారు. బంగారువాకిలి చెంత సభ్యులు, ఎక్స్ అఫీషియో సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. సెప్టెంబర్ 23వ తేదీ సోమవారం ఈ కార్యక్రమం జరిగింది. అనంతరం అన్నమయ్య భవన్‌లో చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ధర్మకర్తలమండలి తొలి సమావేశం జరుగనుంది. దాదాపు 175 అంశాలతో అజెండాను రూపొందించినట్టు తెలుస్తోంది.
ప్రధానంగా సెప్టెంబర్ 30 నుంచి అక్టోబరు 8వ తేదీ వరకు శ్రీ వారి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. దీనిపై పాలకమండలి సభ్యులు చర్చించే అవకాశముంది. ఆ తర్వాత ముడి సరుకుల కొనుగోళ్లు, తిరుమలలో భద్రతను మరింత పటిష్టం చేయటం, సీసీ కెమెరాల కొనుగోళ్లు, అర్చకుల పదవీ విరమణపైనా సభ్యులు చర్చించనున్నారు.
ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న టీటీడీ బోర్డుకు ఇటీవల ప్రభుత్వం లైన్ క్లియర్ ఇచ్చింది. 24మంది పాలకమండలి సభ్యులు, నలుగురు ఎక్స్ అఫిషియో సభ్యులుతో టీటీడీ బోర్డును ఖరారు చేసింది. ఏపీ నుంచి 8 మందికి, తెలంగాణ నుంచి ఏడుగురికి అవకాశం కల్పించారు. అలాగే… తమిళనాడు నుంచి నలుగురు, కర్ణాటక నుంచి ముగ్గురికి ఛాన్స్ ఇచ్చారు. ఢిల్లీ, మహారాష్ట్ర నుంచి ఒక్కొక్కరికి బోర్డులో అవకాశం కల్పించారు. పలువురు ఎమ్మెల్యేలకు, మహిళలు కూడా బోర్డులో స్థానం దక్కించుకున్నారు.
ఏపీ నుంచి : – ఎమ్మెల్యేలు యు.వి.రమణమూర్తిరాజు, మల్లికార్జున రెడ్డి, పార్థసారథితో పాటు.. నాదెండ్ల సుబ్బారావు, డి.పి.అనంత, చిప్పగిరి ప్రసాద్‌కుమార్, పరిగెల మురళీకృష్ణ, వి.ప్రశాంతిలున్నారు.
తెలంగాణ నుంచి : – మై హోమ్ గ్రూప్ సంస్థల చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు, బి.పార్థసారథిరెడ్డి, జి.వెంకటభాస్కరరావు, మూరంశెట్టి రాములు, డి.దామోదర్‌రావు, పుత్తా ప్రతాప్‌రెడ్డి, కె.శివకుమార్‌కు చోటు లభించింది.
తమిళనాడు నుంచి : – కృష్ణమూర్తి వైద్యనాథన్, ఎస్.శ్రీనివాసన్, డాక్టర్ నిచిత ముత్తవరపుతోపాటు ఎమ్మెల్యే కుమార గురుకి అవకాశం ఇచ్చారు.
ఢిల్లీ నుంచి : – ఎమ్‌ఎస్ శివశంకరన్,
కర్నాటక నుంచి : – రమేశ్ శెట్టి, సంపత్ రవి నారాయణ, సుధా నారాయణ మూర్తిలకు అవకాశం దక్కింది.
మహారాష్ట్ర నుంచి : – రాజేశ్‌శర్మకి చోటు కల్పించారు.