ఏపీ బీజేపీకి అభ్యర్ధులు కావలెను

  • Published By: chvmurthy ,Published On : March 17, 2019 / 07:15 AM IST
ఏపీ బీజేపీకి అభ్యర్ధులు కావలెను

Updated On : March 17, 2019 / 7:15 AM IST

జాతీయ స్ధాయిలో చక్రం తిప్పుతున్న కమలం పార్టీ  ఏపీలో మాత్రం పోటీ చేసే  అభ్యర్ధుల కోసం వెతుక్కునే పరిస్ధితి వచ్చింది. అటు టీడీపీ, ఇటు వైసీపీలోకి నేతల వలసలు జోరుగా సాగుతున్నాయి. ఇదే సమయంలో అసంతృప్త నేతలు బీజేపీ వైపు మొగ్గు చూపకపోతారా అని కమలనాధులు ఆశగా ఎదురుచూస్తున్నారు. అదికూడా సీనియర్‌ నేతలు పార్టీలోకి వస్తే పార్టీకి మేలు జరుగుతుందని భావిస్తున్నారు. అందుకోసం ఇప్పటికే పలువురు నేతలతో సంప్రదింపులు కూడా జరిపినట్లు తెలుస్తోంది. 

ఆశావహుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తూనే టీడీపీ నుంచి వైసీపీ, వైసీపీ నుంచి టీడీపీలోకి జరుగుతున్న వలసల తీరును బీజేపీ నిశితంగా పరిశీలిస్తోంది. సీనియర్ నేతల కోసం సీరియస్‌గా అన్వేషిస్తున్నారు. అయితే కమలనాధుల గాలానికి అభ్యర్ధులు చిక్కుతారా..? లేదా అనేది చూడాల్సి ఉంది.  కాగా….. వైసీపీ  నుంచి పోటీ చేసే మొత్తం అభ్యర్ధులను పార్టీ ఆదివారం ప్రకటించింది. వైసీపీలో టికెట్ ఆశించి భంగపడ్డవారు ఇప్పుడు ఏదో ఒక పార్టీ లోమళ్ళీ ట్రై చేసే అవకాశం ఉంది.

లోక్‌సభ, శాసనసభ నియోజకవర్గాల నుంచి పోటీ చేసేవారి నుంచి గుంటూరులోని పార్టీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ దరఖాస్తులు స్వీకరిస్తోంది. ప్రస్తుతానికి 25 లోక్‌సభ స్థానాలకు 196, 175 శాసససభ స్థానాలకు 673 వరకు దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. ఇవి కాకుండా ఆన్ లైన్ ద్వారా మరికొన్ని దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. విజయవాడ లోక్‌సభ స్థానాన్ని ఆశిస్తున్న కిలారు దిలీప్ ర్యాలీగా విజయవాడ నుంచి గుంటూరు వచ్చి పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు దరఖాస్తు అందజేశారు. ఇక అమలాపురం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని బీజేపీ మీడియా కన్వీనర్ వుల్లూరి గంగాధర్  కన్నాకు తెలిపారు.   

పార్లమెంట్ స్ధానాలకు వచ్చే దరఖాస్తుల కంటే అసెంబ్లీ స్ధానాలకు వచ్చే దరఖాస్తులే ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. బీజేపీ తరపున పోటీ చేసేందుకు కాస్త ఆర్థిక స్తోమత కలిగినవారితో పాటు మధ్య తరగతి వర్గాలూ ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. ఇక వ్యాపార, ఇతర రంగాలకు చెందినవారు కూడా ఇందులో ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న కె.జ్యోతి సుధాకర్ కృష్ణ ఏలూరు శాసనసభ స్థానం నుంచి పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని దరఖాస్తు చేశారు. ఏలూరు లోక్ సభ స్థానానికి బంగారం వ్యాపారి చక్కా సుబ్బారావు దరఖాస్తు చేశారు. బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి, టింబర్ డిపో కార్యదర్శి బొల్లిశెట్టి వెంకట రామకృష్ణ కాకినాడ రూరల్ స్థానం నుంచి పోటీ చేసేందుకు దరఖాస్తు చేశారు. మార్చి 20వ తేదీ నాటికి అభ్యర్థుల ఎంపిక పూర్తిచేయాలనుకుంటున్న బీజేపీకి అభ్యర్ధులు ఎంతవరకు దొరుకుతారో వేచి చూడాలి.