పోలవరంపై మాటల యుద్ధం : జగన్ మేధావా

  • Published By: madhu ,Published On : September 21, 2019 / 12:39 AM IST
పోలవరంపై మాటల యుద్ధం : జగన్ మేధావా

Updated On : September 21, 2019 / 12:39 AM IST

పోలవరంపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. విమర్శలు, ప్రతి విమర్శలతో పోలవరంపై మరోసారి రాజకీయ సెగ రాజుకుంటోంది. ప్రాజెక్ట్‌ రివర్స్‌ టెండరింగ్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. నిపుణులకంటే సీఎం జగన్ మేధావా అని ప్రశ్నించారు.

ప్రాజెక్టు నాణ్యతకు సంబంధించిన సాంకేతిక అంశాలు  మీడియాకు విడుదల చేశారు. రివర్స్ టెండరింగ్ పేరుతో తాము అనుకున్న వ్యక్తికి ప్రాజెక్టును వైసీపీ నేతలు రిజర్వ్ చేసుకున్నారని ఆరోపించారు. ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమైతే వ్యయం కూడా పెరుగుతుందని నిపుణులు తేల్చారన్నారన్నారు. నిపుణుల కమిటీని కాదని ముందుకెళ్తున్నారని మండిపడ్డారు. 

నచ్చిన సంస్థకు పనులు ఇచ్చేందుకు భద్రతను పణంగా పెడుతున్నారని దుయ్యబట్టారు చంద్రబాబు. తమకు అనుకూలమైన సంస్థ ప్రాథమిక అర్హత సాధించకపోవటంతో అందుకు తగ్గట్లుగా నిబంధనలు మార్చారని మండిపడ్డారు. 55లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉండే చోట నాణ్యత ప్రమాణాలు లేని సంస్థకు ప్రాజెక్టు కట్టబెట్టేలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని దోచుకోవటానికి ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారని విమర్శించారు. పోలవరం విషయంలో రాజీపడేది లేదన్న చంద్రబాబు… గట్టిగా పోరాడతామని తేల్చిచెప్పారు