నారా వారి ఊరిలోనే: టీడీపీనే టార్గెట్.. వైసీపీ కొత్త ప్లాన్

  • Published By: vamsi ,Published On : February 1, 2020 / 10:04 PM IST
నారా వారి ఊరిలోనే: టీడీపీనే టార్గెట్.. వైసీపీ కొత్త ప్లాన్

Updated On : February 1, 2020 / 10:04 PM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతే రాజధాని అంటూ టీడీపీ ఉద్యమం చేస్తుండగా..  ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు, పార్టీకి ఝలక్ ఇచ్చేందుకు ప్రభుత్వంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం అయ్యింది. ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు పర్యటిస్తుండగా… దీనికి కౌంటర్‌గా ఇతర ప్రాంతాల్లో మూడు రాజధానులకు మద్దతుగా ర్యాలీలు, సభలు నిర్వహిస్తుంది వైసీపీ.

ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సొంత ఊరిలోనే చంద్రబాబుకు వ్యతిరేకంగా భారీ భహిరంగ సభను నిర్వహించాలని చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏర్పాట్లు చేస్తున్నారు. చంద్రబాబు సొంతూరైన చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో మూడు రాజధానులకు మద్దతుగా చంద్రబాబు ఇంటికి సమీపంలోనే ఈ బహిరంగ సభను ఏర్పాటు చేయబోతున్నారు.

ప్రజా సదస్సు పేరుతో నిర్వహించబోయే ఈ సభకు వైసీపీ ముఖ్యనేత విజయసాయిరెడ్డితో పాటు ఏడుగురు మంత్రులు హాజరుకానున్నట్టు తెలుస్తోంది. మూడు రాజధానుల వల్ల కలిగే ప్రయోజనాలు, చంద్రబాబు రాయలసీమకు ద్రోహం చేస్తున్నారంటూ బలంగా విషయాన్ని జనాల్లోకి తీసుకుని వెళ్లాలనేది వారి ఆలోచన. చంద్రబాబు సొంతూరు ప్రజలే మూడు రాజధానులకు మద్దతు తెలుపుతున్నారనే వాదనను ప్రజల్లోకి తీసుకెళ్లాలనేది వైసీపీ ప్లాన్. ఇప్పటికే నారావారిపల్లెలో థ్యాంక్యూ సీఎం అంటూ జగన్ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు అధిరకార పార్టీ నాయకులు.