జగన్ గృహ ప్రవేశం : పార్టీ నేతలు ఫుల్ ఖుష్

  • Published By: madhu ,Published On : February 27, 2019 / 01:53 AM IST
జగన్ గృహ ప్రవేశం : పార్టీ నేతలు ఫుల్ ఖుష్

Updated On : February 27, 2019 / 1:53 AM IST

ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ కొత్త ఇంట్లోకి అడుగుపెట్టారు. ఫిబ్రవరి 27వ తేదీ బుధవారం  ఉదయం 8.19 నిమిషాలకు ఇంట్లోకి కుటుంబసమేతంగా వెళ్లారు. ఈ సందర్భంగా సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం వైఎస్‌ జగన్‌, భారతి దంపతులు నూతన ఇంట అడుగుపెట్టారు. ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులు వైఎస్‌ విజయమ్మ, షర్మిల, అనిల్‌ కుమార్‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్‌ రెడ్డి, తలశిల రఘురాం తదితరులు పాల్గొన్నారు.

గుంటూరు జిల్లా తాడేపల్లిలో జగన్ కొత్త ఇంటిని నిర్మించుకున్నారు. వాస్తవానికి ఈ నెల 14న గృహప్రవేశం చేయాలని ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నారు. అయితే షర్మిల అనారోగ్యం కారణంగా వాయిదా వేసుకున్నారు. తర్వాత లండన్‌లో చదువుకుంటున్న కూతురు దగ్గరకు వెళ్లారు జగన్‌. 5రోజుల పర్యటన ముగించుకొని హైదరాబాద్‌ వచ్చారు.

జగన్‌ ఇల్లు నిర్మించుకున్న స్థలం మంగళగిరి అసెంబ్లీ పరిధిలోకి వస్తుంది. గుంటూరు జిల్లా తాడేపల్లిలో పార్టీ కార్యాలయం, ఇల్లు పక్కపక్కనే ఉన్నాయి. ఈ రెండు నిర్మాణాలు ఒకే ప్రాంగణంలో నిర్మించడంతో భవిష్యత్‌లో ఇక్కడి నుంచే పార్టీ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కొత్త ఇల్లు గృహ ప్రవేశానికి పార్టీ రీజనల్‌ కో-ఆర్డినేటర్లు, పార్లమెంటరీ ఇన్‌చార్జ్‌లు, జిల్లా అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర అధికార ప్రతినిధులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, ఇతర ముఖ్య నాయకులకు ఆహ్వానాలు పంపారు. 

ఏపీలో ఉన్న ప్రధాన పార్టీల్లో అమరావతిలో సొంత ఇల్లు ఒక్క జగన్‌కు మాత్రమే ఉంది. ఇప్పటి వరకు లోటస్‌పాండ్‌ నుంచి పార్టీ కార్యకలాపాలు నిర్వహించిన జగన్‌ ఇక నుంచి అమరావతి నుంచే నిర్వహించనున్నారు. పార్టీ కార్యాలయం షిప్ట్ కావడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. అమరావతి ప్రాంతంలోనే సొంత ఇల్లు నిర్మించుకొని మీతో పాటు ఉంటున్నానంటూ శ్రేణుల్లో జగన్ ఆత్మస్థైర్యం పెంచనున్నారు.

లోటస్‌పాండ్ కేంద్రంగా పార్టీని నడిపిస్తున్నారన్న ప్రతిపక్షాల విమర్శలకు చెక్‌పెట్టనున్నారు. జగన్‌ మకాం అమరావతికి మార్చడంతో…ఏపీ రాజకీయాలు వేడెక్కనున్నాయి. ఎన్నికల వేళ జగన్‌…కొత్త ఇంట్లోకి ప్రవేశించడంతో ఆ పార్టీ నేతల్లో ఆనందం నెలకొంది.