చెల్లిపై ప్రేమ : అత్తింటి నుంచి హెలికాప్టర్‌లో తీసుకెళ్లిన అన్న

చెల్లిపై ప్రేమ : అత్తింటి నుంచి హెలికాప్టర్‌లో తీసుకెళ్లిన అన్న

Updated On : December 16, 2020 / 5:53 PM IST

చెల్లిపై ఆ అన్నకు ఉన్న ప్రేమను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. అత్తారింటి నుంచి పుట్టింటికి ఏకంగా హెలికాప్టర్‌లో చెల్లిని తీసుకెళుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. తన సోదరికి వినూత్నంగా స్వాగతం పలుకాలనే ఉద్దేశ్యంతో ఇలా చేసినట్లు సోదరుడు వెల్లడించాడు. ఈ ఘటన జల్గావ్ జిల్లాలో చోటు చేసుకుంది. ముహుర్తాలు మంచిగా ఉండడంతో భారీ సంఖ్యలో పెళ్లిళ్లు జరుగుతున్నాయి. జల్గావ్‌కు చెందిన శివాని కావడియా పెళ్లి..పర్లీలోని వైజ్యనాథ్ ప్రాంతంలో ఉంటున్న జైన్ కుటుంబానికి చెందిన డాక్టర్ కుణాల్ జైన్‌తో ఇటీవలే పెళ్లి జరిగింది.

పెళ్లి జరిగిన తర్వాత..ఘనంగా కూతురిని అత్తాంరింటికి పంపించారు. కుటుంబ సంప్రదాయ ప్రకారం..శివాని తిరిగి పుట్టింటికి రావాల్సి ఉంది. సోదరిని తీసుకొచ్చే బాధ్యతలు విరాజ్ కావడియాకు అప్పగించారు కుటుంబపెద్దలు. తన చెల్లిని వినూత్నంగా తీసుకరావాలని విరాజ్ భావించాడు. అద్దెకు హెలికాప్టర్ బుక్ చేసుకున్నాడు. వైజ్యనాథ్ గ్రామానికి హెలికాప్టర్ రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఊరు బయట ఉన్న బారిస్టర్ నికం మైదానంలో హెలికాప్టర్ ను ల్యాండింగ్ చేశాడు. సోదరిని, బావను విరాజ్ ఆహ్వానించాడు. వారిద్దరికీ పూలమాలలు వేశాడు. గాలిలో బెలూన్లను ఎగురవేసి ఘనంగా స్వాగతం పలికాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీరిద్దరూ హెలికాప్టర్ వద్ద నిల్చొని ఫొటోలు దిగారు.