Weather Updates: ఏపీలో భిన్నమైన వాతావరణం.. రానున్న రెండు రోజులు పిడుగుల వానలు, మండుటెండలు
దక్షిణ కోస్తాంధ్ర-పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.
Weather Updates: ఏపీలో భిన్నమైన వాతావరణం నెలకొంది. ఓవైపు ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడు నిప్పులు కక్కుతున్నాడు. తెలుగు రాష్ట్రాలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. తీవ్రమైన ఎండలతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మరోవైపు పిడుగులతో కూడిన వానలు హడలెత్తిస్తున్నాయి. రాష్ట్రం ఇలాంటి విభిన్నమైన వాతారణం కొనసాగనుంది. రానున్న రెండు రోజులు రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొననున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.
రేపు, ఎల్లుండి మేఘావృతమైన వాతావరణంతో పాటు పిడుగులతో కూడిన వర్షాలు పడతాయన్నారు. మరోవైపు కొన్ని జిల్లాల్లో ఎండలు ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. దక్షిణ కోస్తాంధ్ర -పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. రాయలసీమ, పరిసర ప్రాంతాలపై మరొక ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందన్నారు. వీటి ప్రభావంతో రేపు, ఎల్లుండి మేఘావృతమైన వాతావరణంతో పాటు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు పొలాల్లో పని చేసే రైతులు, పశుకాపరులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో, చెట్ల కింద, కరెంట్ పోల్స్ కింద నిలబడరాదని హెచ్చరించారు. సురక్షితమైన ప్రాంతాల్లోనే తలదాచుకోవాలన్నారు.
సోమ, మంగళవారాల్లో వాతావరణం ఈ విధంగా ఉండే అవకాశం..
* శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం.
* ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం.
రేపు పోలవరం జిల్లా చింతూరు, ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లో వడగాలులు (03) ప్రభావం చూపనున్నట్లు తెలిపారు.
ఆదివారం మన్యం జిల్లా వీరఘట్టం, నెల్లూరు (జి) నెల్లూరుపాలెంలో 42.4°C, తిరుపతి (జి) రేణిగుంటలో 42.3°C, మార్కాపురం (జి) నందన మారెళ్లలో 41.8°C, కడప (జి) ఒంటిమిట్టలో 41.5°C, కృష్ణా (జి) పెద్దపారుపూడిలో 41.3°C, చిత్తూరు (జి) పలమనేరు, ప్రకాశం (జి) చెరువుకొమ్ము పాలెంలో 40.9°C, కర్నూలు (జి) తోవి, శ్రీకాకుళం (జి) జి.సిగడాంలో 40.7°C, అనంతపురం (జి) భట్టువానిపల్లిలో 40.5°C, పల్నాడు (జి) గురజాలలో 40.4°C, విజయనగరం (జి) సంతకవిటిలో 40.3°C, నంద్యాలలో 40.1°C చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు, 66 మండలాల్లో 40°C కుపైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు. ఎండ తీవ్రత, ఉక్కపోత నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Also Read: కూతురికి విడాకులు.. కోర్టు బయట బ్యాండ్ బాజా బారాత్.. జడ్జి డ్యాన్సులు..
