Hyderabad Rain: హైదరాబాద్ ను ముంచెత్తిన వర్షం.. అధికార యంత్రాంగం అప్రమత్తం.. ఆస్తి ప్రాణనష్టం జరక్కుండా చర్యలు

Hyderabad Rain: హైదరాబాద్ ను ముంచెత్తిన వర్షం.. అధికార యంత్రాంగం అప్రమత్తం.. ఆస్తి ప్రాణనష్టం జరక్కుండా చర్యలు

Updated On : August 7, 2025 / 11:49 PM IST

Hyderabad Rain: జీహెచ్ఎంసీ పరిధిలో కురుస్తున్న భారీ వర్షాలతో అధికార యంత్రాంగం అలర్ట్ అయ్యింది. ప్రాణ, ఆస్తి నష్టం జరక్కుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు అధికారులను ఆదేశించారు. భారీ వర్షం నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు సీఎస్. ఈ టెలీ కాన్ఫరెన్స్ లో విపత్తుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్, హైడ్రా కమిషనర్ రంగనాధ్, జల మండలి ఎండీ అశోక్ రెడ్డి, విద్యుత్ విభాగం సిఎండీ ముష్రాఫ్ అలీ, సమాచార శాఖ స్పెషల్ కమిషనర్ ప్రియాంక, మూడు పోలీస్ కమిషనరేట్ల కమిషనర్లు, హైదరాబాద్, రంగా రెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.

గురువారం సాయంత్రం నుండి ఆకస్మికంగా కురుస్తున్న భారీ వర్షాలతో అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడా ప్రాణ నష్టం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సీఎస్ చెప్పారు. నగరంలోని కొన్ని ప్రాంతాలలో 12 సెంటీమీటర్ల వరకు వర్షపాతం రికార్డ్ అయిందని తెలిపారు. వర్షం వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. నీరు నిలిచే ప్రాంతాల (వాటర్ లాగింగ్ పాయింట్స్)పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ముఖ్యంగా వాటర్ లాగింగ్ రిపోర్ట్ అవుతున్న ఐటీ కారిడార్, టివీ-9, టైమ్స్ ఆఫ్ ఇండియా, రాజ్ భవన్, షేక్ పేట్ ఏరియాలలో నీటి నిలువ సమస్య వస్తున్నందున తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

వర్షాల వల్ల ప్రజలకు అసౌకర్యం కలగకుండా జీహెచ్ఎంసీ అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్ళవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రజలు డ్రైనేజ్, నాలాల మూతలు ఎట్టి పరిస్థితుల్లో తొలగించవద్దని విజ్ఞప్తి చేశారు. అదే విధంగా వర్షం పడే సమయంలో విద్యుత్ స్తంభాల సమీపంలో ఉండకూడదన్నారు.

క్షేత్రస్థాయి అధికారులు అప్రమత్తంగా ఉండి, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులకు తక్షణమే స్పందించాలని సూచించారు. హైడ్రాతో సమన్వయం చేసుకుంటూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.

క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బంది వేగంగా స్పందిస్తున్నారని తామంతా అప్రమత్తంగా ఉన్నామని అధికారులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తెలియజేశారు. 250 టీమ్ లు క్షేత్ర స్థాయిలో పని చేస్తున్నట్లు తెలిపారు. NDRF, SDRF, HYDRAA, GHMC టీంలు సిద్ధంగా ఉన్నాయన్నారు. జీహెచ్ఎంసీ, కలెక్టర్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్ లు పని చేస్తున్నాయని సీఎస్ కి తెలిపారు.

దాదాపు 250 విద్యుత్ కు సంబంధించిన సమస్యలు రిపోర్ట్ అయ్యాయని, అందులో 149 సమస్యలు వెంటనే పరిష్కరించామని, మిగతా ఫిర్యాదులు త్వరలోనే పూర్తవుతాయని చెప్పారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దని, ప్రభుత్వ యంత్రాంగం సూచనలను పాటించి సహకరించాలని కోరారు.