Telangana Rains: తెలంగాణకు బిగ్ రెయిన్ అలర్ట్.. రేపు ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు.. 5 రోజులు వానలే వానలు..
రుతుపవన ద్రోణి కారణంగా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ కర్ణాటక నుండి దక్షిణ ఆంధ్ర తీరం వరకు ద్రోణి కొనసాగుతోంది.

heavy rains
Telangana Rains: తెలంగాణకు వర్ష సూచన చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. రాష్ట్రంలో రానున్న 5 రోజులు వానలు పడతాయంది. మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న తెలిపారు. రేపు ఎల్లుండి రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట్రంలో పలు జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం. వికారాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్ గిరి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఎల్లో అలర్ట్ కొనసాగుతోంది.
ఈ నెల 23వ తేదీ వరకు పలు జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ కేంద్రం. మంగళవారం వరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇవాళ పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉమ్మడి రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో పలు చోట్ల భారీ వానలు కురుస్తాయని హెచ్చరించింది. మిగిలిన అన్ని జిల్లాల్లోనూ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది. రేపు ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది.
ఈశాన్య బంగాళాఖాతంపై కొనసాగుతున్న రుతుపవన ద్రోణి, నైరుతి ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో వాయుగుండగం కారణంగా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ కర్ణాటక నుండి దక్షిణ ఆంధ్ర తీరం వరకు ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఈ నెల 23వ తేదీ వరకు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురువనున్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు 65 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.
తెలంగాణ రాష్ట్రంలోని దాదాపు 21 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైన పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో కురిసే వానలు లోటు తీరుస్తాయని అధికారులు అంచనా వేశారు. ప్రస్తుతం కురుస్తున్న వానలతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సాగు పనులను వేగవంతం చేస్తున్నారు రైతులు.