Weather Updates: తెలంగాణపైనా మొంథా తుఫాన్ ఎఫెక్ట్.. భారీ వర్షాలు.. ఈ 6 జిల్లాలకు రెడ్ అలర్ట్..
తుఫాన్ ప్రభావంతో వరంగల్ నగరం అస్తవ్యస్తమైంది. కాజీపేట, వరంగల్, హనుమకొండ జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.
Weather Updates: తీరాన్ని తాకిన మొంథా తుఫాన్ తెలుగు రాష్ట్రాలపై తీవ్రమైన ప్రభావం చూపిస్తోంది. విధ్వంసం సృష్టిస్తోంది. ఏపీ, తెలంగాణలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. నాన్ స్టాప్ గా వానలు దంచికొడుతున్నాయి. తెలంగాణపై తుపాను ప్రభావం గట్టిగానే ఉంది. పలు జిల్లాలో కుండపోత వానలు పడుతున్నాయి. ఆరు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.
హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, జనగాం, సిద్ధిపేట్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఇక ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, సూర్యాపేట జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అటు నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, రంగారెడ్డి, నల్లగొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణశాఖ. రేపు ఉదయం వరకు ఈ జిల్లాల పరిధిలో భారీగా వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
అటు ఖమ్మం-మహబూబాబాద్ మార్గంలో రాకపోకలు నిలిపివేశారు అధికారులు. ఈ మార్గంలోని వాల్యాతండా వద్ద ఆకేరు వాగు పొంగి ప్రవహిస్తుండటంతో ప్రయాణాలను అనుమతించడం లేదు. పెద్దపల్లి జిల్లా సింగరేణి ఓపెన్ కాస్ట్ గనులపై రెయిన్ ఎఫెక్ట్ పడింది. రామగుండం రీజియన్ లోని నాలుగు ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.
తుఫాన్ ప్రభావంతో వరంగల్ నగరం అస్తవ్యస్తమైంది. కాజీపేట, వరంగల్, హనుమకొండ జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వర్షపు నీరు భారీ ఎత్తున రోడ్లపైకి వచ్చి చేరింది. ట్రాఫిక్ జామ్ తో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. హనుమకొండ, వరంగల్ చౌరస్తా సెంటర్లు.. హనుమకొండ బస్టాండ్ సహా నగరంలోని జంక్షన్ వర్షపు నీటిలో మునిగిపోయాయి.
ఏపీపైనే కాదు తెలంగాణపైన కూడా తుపాను ప్రభావం పడుతోంది. మరో 24 గంటల పాటు రాష్ట్రంపై తుపాను ఎఫెక్ట్ ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాత్రికి దక్షిణ తెలంగాణ, హైదరాబాద్ ప్రాంతాల్లో వర్షాలు తగ్గే అవకాశం ఉండగా.. ఆదిలాబాద్ లో వర్షాలు ఎక్కువ పడే ఛాన్స్ ఉంది.
