KTR: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తే ఏమైనా జరగొచ్చు.. మూడేళ్లు వెయిట్ చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చు- కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
జీహెచ్‌ఎంసీ ఎన్నికల తర్వాత ఫ్రీ వాటర్ స్కీమ్ కూడా ఎత్తేస్తారు. పార్లమెంట్‌లో రాజ్యాంగ సవరణ చేస్తేనే.. జరుగుతుందని మేం ముందే చెప్పాం.
KTR: తెలంగాణ భవన్ లో మున్నూరు కాపుల ఆత్మీయ సమ్మేళనంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తే ఏమైనా జరగొచ్చన్నారు. మూడేళ్లు వెయిట్ చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ పై కేటీఆర్ మండిపడ్డారు. నవీన్ యాదవ్ బెదిరింపులకు దిగుతున్నాడని ఆరోపించారు.
కాంగ్రెస్ పైసలు ఇస్తే తీసుకోండి అన్న కేటీఆర్.. ఓటు మాత్రం బీఆర్‌ఎస్‌కు వేయండని ఓటర్లకు పిలుపునిచ్చారు. కత్తి వాళ్లకు ఇచ్చి.. యుద్ధం మమ్మల్ని చేయమంటే ఎలా..? అని ప్రశ్నించారు. కత్తి మాకు ఇవ్వండి.. కాంగ్రెస్ తో యుద్ధం చేసే బాధ్యత మాది అని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ పాలనలో ఎస్సీలు, ఎస్టీలు, ముస్లింలు, మహిళలు, వృద్ధులు అందరూ బాధపడుతున్నారని కేటీఆర్ వాపోయారు. కోటి మంది కోటీశ్వరులను చేయడం ఏంటో కానీ.. మహిళలకు ఇస్తామన్నవి ఇవ్వండని రేవంత్ సర్కార్ ని డిమాండ్ చేశారు. భర్త చనిపోతే భార్యకు బాధ ఉండదా? మాగంటి సునీతపై కామెంట్ చేయడానికి మంత్రులకు సిగ్గు ఉండాలని కేటీఆర్ ధ్వజమెత్తారు.
వాళ్ల కుటుంబంలో ఎవరైనా చనిపోతే కాంగ్రెస్ నేతలకు బాధ కలగదా..? అని నిలదీశారు. జూబ్లీహిల్స్‌లో 12 నుంచి 13 వేల దొంగ ఓట్లు కాంగ్రెస్ రాయించిందన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి సోదరుడికే మూడు ఓట్లు ఉన్నాయన్నారు. ప్రజలు ఎలాగూ ఓటేయరని తెలిసి.. దొంగ ఓట్లతో గెలవాలని చూస్తున్నారని కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రజలు అప్రమత్తంగా లేకపోతే.. మీ ఓటు కూడా ఎవరో ఒకరు వేసేస్తారని హెచ్చరించారు. అది జరగకుండా.. ప్రజలు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు.
మున్నూరు కాపులను కేసీఆర్ ఎలా చూసుకున్నారో మీకు కూడా తెలుసు అన్న కేటీఆర్.. మున్నూరు కాపులకు సముచిత గౌరవం, సముచిత ప్రాధాన్యం ఇచ్చిన ఘనత కేసీఆర్‌దే అన్నారు. రైతులకు దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని మంచి పనులు కేసీఆర్ చేశారని కేటీఆర్ అన్నారు.
”కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటు కూడా సరిగా ఉండట్లేదు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల తర్వాత ఫ్రీ వాటర్ స్కీమ్ కూడా ఎత్తేస్తారు. ఒక ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డే ఈ విషయాన్ని బయటపెట్టారు. ఒక్క కొత్త రోడ్డు లేదు.. కొత్త బ్రిడ్జ్ లేదు.. కొత్త బిల్డింగ్ కట్టలేదు. కానీ.. కేసీఆర్ కట్టిన బిల్డింగ్‌లను మాత్రం ఓపెన్ చేస్తున్నారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అంటూ బీసీలను మోసం చేస్తున్నారు. పార్లమెంట్‌లో రాజ్యాంగ సవరణ చేస్తేనే.. జరుగుతుందని మేం ముందే చెప్పాం. బీసీలకు రూ.20వేల కోట్లు, ఐదేళ్లలో లక్ష కోట్ల బడ్జెట్ అన్నారు.. ఎందుకు ఇవ్వరు? రేవంత్ .. తన చేతిలో లేని ముచ్చట చెబుతూ.. ఇవ్వాల్సిన వాటి గురించి మాట్లాడరు. పార్లమెంట్‌లో బిల్లు పెడితే మేం కూడా మద్దతిస్తామని చెప్పాం” అని కేటీఆర్ అన్నారు.
Also Read: తెలంగాణ కేబినెట్ లోకి అజారుద్దీన్.. ఎల్లుండే ప్రమాణస్వీకారం!
