ప్రతి భారతీయుడికి హెల్త్ కార్డు, స్వాతంత్ర్య దినోత్సవాన నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ ప్రారంభించిన ప్రధాని మోడీ

  • Published By: naveen ,Published On : August 15, 2020 / 08:58 AM IST
ప్రతి భారతీయుడికి హెల్త్ కార్డు, స్వాతంత్ర్య దినోత్సవాన నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ ప్రారంభించిన ప్రధాని మోడీ

ఆసేతు హిమాచలం త్రివర్ణశోభితంగా మారింది. యావత్ భారతావని 74వ స్వాతంత్ర్య వేడుకలను ఘనంగా జరుపుకుంటోంది. దేశవ్యాప్తంగా పంద్రాగస్టు వేడుకల సందడి కనిపిస్తోంది. కాగా, కరోనా నేపథ్యంలో తొలిసారిగా దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య వేడుకలను నిరాడంబరంగా నిర్వహించారు. దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోటలో హంగూ ఆర్భాటం లేకుండా పంద్రాగస్టు వేడుకలు నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోడీ ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోడీ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలు, దేశం ఎదుర్కొంటున్న కీలక సవాళ్లు.. ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసేందుకు చేపట్టిన సంస్కరణలను దేశ ప్రజలకు వివరించారు. పంద్రాగస్టు వేడుకల్లో ప్రధాని మోడీ కీలక ప్రకటన చేశారు. కొత్త స్కీమ్ అనౌన్స్ చేశారు. నేటి(ఆగస్టు 15,2020) నుంచి నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. ప్రతి పౌరుడికి హెల్త్ ఐడీ ఇస్తామన్నారు.



ఆధార్‌లా హెల్త్ కార్డు:
దేశంలోని ప్రతి పౌరుడి ఆరోగ్య రికార్డులను డిజిటల్ రూపంలో భద్రపరిచేలా ఇది ఉంటుంది. ఒక వ్యక్తి తాను చేయించుకున్న వైద్య చికిత్సలు, పరీక్షలు, మెడికల్ హిస్టరీ రికార్డులన్నీ దీనిలో ఉండనున్నాయని సమాచారం. ఆధార్ లా ఈ హెల్త్ కార్డును రూపొందించే అవకాశం ఉంది. ఫార్మసీ, డాక్టర్ దగ్గరికి వెళ్లిన ప్రతిసారి ఆ వివరాలన్నీ హెల్త్ కార్డులో పొందుపరుస్తారు. డాక్టర్ అపాయింట్ మెంట్, డాక్టర్ ఇచ్చిన మెడికేషన్ ఇలా ప్రతిదీ హెల్త్ కార్డులో ఉంటుంది.



ఆత్మనిర్భర్‌ భారత్‌ సాధించాలి:
”స్వాతంత్ర్య సంగ్రామ ప్రేరణతో దేశం ముందుకు సాగుతోంది. ఆత్మనిర్భర్‌ భారత్‌ పేరుతో దేశం ముందడుగు వేయడానికి సిద్ధమైంది. కరోనా విపత్కర సమయంలోనూ దేశం ఒక్కటై నిలబడింది. 25 ఏళ్లు వచ్చిన ప్రతిబిడ్డ సొంతకాళ్లపై నిలబడాలని కుటుంబం కోరుకుంటోంది. 75 ఏళ్ల తర్వాత కూడా భారత్‌ స్వయం సమృద్ధి సాధించలేకపోయింది. ఈ క్షణం నుంచి స్వయం సమృద్ధికి బలమైన సంకల్పంతో ముందుకువెళ్లాలి. ప్రపంచం ఇప్పుడు పరస్పర ఆధారితం.. ఏ ఒక్కరూ ఏకాకిగా మనలేరు. భారత్‌ అంటే కేవలం క్రమశిక్షణ మాత్రమే కాదు.. ఉన్నత విలువలతో కూడిన జీవనం. ప్రపంచ కల్యాణానికి మనవంతు కూడా నిరంతరం చేస్తున్నాం. ఆత్మనిర్భర్‌ భారత్‌ అనేది కేవలం నినాదం మాత్రమే కాదు. ఆత్మనిర్భర్‌ భారత్‌ కోసం మనందరి సంకల్పం కావాలి. దేశ యువత ఆత్మ విశ్వాసంతో ఆత్మనిర్భర్‌ భారత్‌ సాధించాలి’’ అని మోడీ పిలుపునిచ్చారు.

* నేటి నుంచి నేషనల్ హెల్త్ మిషన్ ప్రారంభం, ప్రతి పౌరుడికి హెల్త్ ఐడీ
* భారత్ ఏదైనా సంకల్పం చేసిందంటే అది చేసి తీరుతుంది
* ఆత్మనిర్భర్ కలను భారత్ సాకారం చేసుకుంటుంది
* చైనా వస్తువుల దిగుమతి పూర్తిగా నిషేధించాలి
* ఇకపై మన వస్తువులను మనమే తయారు చేసుకోవాలి
* యువత ఆత్మ విశ్వాసంతో ఆత్మనిర్భర్ భారత్ సాధించాలి
* దేశ రవాణ రంగం గతినే మార్చేసింది
* ఉద్యోగాలకు చేసే గర్భవతి మహిళలకు 6 నెలల సెలవు
* రోడ్డు, రైలుమార్గాలు, పోర్టుల అభివృద్ధి, అనుసంధానం ప్రారంభించాం
* మేకిన్ ఇండియాతో పాటు, మేక్ ఫర్ వరల్డ్ నినాదంలో ముందుకెళ్లాలి
* కష్టకాలంలో ప్రతీ ఇంటికి ఆహార ధాన్యం చేరింది
* వ్యవసాయ రంగంలో సంస్కరణలకు ప్రాధాన్యం
* పట్టణాలు, గ్రామాల్లో మౌలిక వసతులు అభివృద్ధి చేస్తాం