జగన్ శ్రీకాకుళం పర్యటన : సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి శంకుస్థాపన

  • Published By: chvmurthy ,Published On : September 4, 2019 / 04:09 PM IST
జగన్ శ్రీకాకుళం పర్యటన : సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి శంకుస్థాపన

ఏపీ సీఎం జగన్ సెప్టెంబరు 6 శుక్రవారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించి పలు అభివృధ్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. జిల్లాలోని పలాస, ఎచ్చెర్ల, శ్రీకాకుళం నియోజక వర్గాల్లో  ఆయన పర్యటన కొనసాగుతుంది. 

సెప్టెంబరు 6న ఉదయం 9:30 గంటలకు గన్నవరంలో బయల్దేరిన సీఎం విశాఖ  చేరుకుంటారు. అక్కడి నుంచి ఆయన నేరుగా పలాసకు వెళతారు. ఉదయం 11 గంటలకు కాశీబుగ్గ  చేరుకోని అక్కడ రైల్వే గ్రౌండ్స్‌లో… ఉద్దానం ప్రాంత ప్రజలకు పరిశుభ్రమైన తాగునీటి సరఫరా ప్రాజెక్టుకు…వజ్రపు కొత్తూరు మండలం మంచినీళ్లపేటలో మత్స్యకారుల కోసం నిర్మించనున్న జెట్టీ నిర్మాణానికి అక్కడే శంకుస్థాపన  చేస్తారు. అనంతరం పలాస చేరుకుని కిడ్నీ రోగులకోసం  నిర్మించనున్న 200 పడకల సూపర్‌ స్పెషాల్టీ, రీసెర్చ్‌ ఆస్పత్రికి శంకుస్థాపన  చేస్తారు. అనంతరం పైలట్‌ ప్రాజెక్టు కింద శ్రీకాకుళం జిల్లాలో చేపట్టిన ఇంటింటికీ నాణ్యమైన బియ్యం పంపిణీని ప్రారంభించి బహిరంగసభలో ప్రసంగిస్తారు.

మధ్యాహ్నం 1 గం. కు ఎచ్చెర్ల చేరుకోనే సీఎం  ఎస్‌.ఎం.పురంలో ట్రిపుల్‌ ఐటీలో తరగతి గదులను, హాస్టల్‌ బ్లాక్‌లను ప్రారంభిస్తారు. అనంతరం విద్యార్థులతో ముచ్చటిస్తారు. శ్రీకాకుళం జిల్లా సింగుపురంలో అక్షయపాత్ర సెంట్రలైజ్డ్‌ కిచెన్‌ను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి నేరుగా విశాఖ విమానాశ్రయానికి  చేరుకుని గన్నవరానికి తిరిగి వెళ్తారు.