బోటు కోసం వేట : 13 మంది కోసం గాలింపు

  • Published By: madhu ,Published On : September 19, 2019 / 01:01 AM IST
బోటు కోసం వేట : 13 మంది కోసం గాలింపు

గోదావరిలో 40మందికి పైగా ప్రాణాలు తీసిన బోటు కోసం వేట ఇంకా సాగుతూనే ఉంది. ప్రమాదానికి గురైన పడవ గురించి అన్వేషణ జరుగుతూనే ఉంది. ఇంకా ఆచూకీ లభించని వారి మృతదేహాలను కనుగొంటూనే.. మరోపక్క బోటును నీటి పైకి తీసుకొచ్చే మార్గాలను పరిశీలిస్తున్నాయి రెస్క్యూ టీమ్‌లు. గత నాలుగు రోజులుగా సాగుతున్న అన్వేషణలో బోటు జాడ మాత్రం కనిపెట్టాయి రెస్క్యూ బృందాలు.

డెహ్రడూన్‌ నుంచి వచ్చిన స్పెషల్‌ వెసల్‌ రికవరీ టీమ్‌.. ప్రమాదానికి గురైన రాయల్‌ వశిష్ట బోటు దాదాపు 2వందల అడుగుల లోతున ఉన్నట్టు గుర్తించింది. అయితే దీన్ని బయటకు తీయడం ఇప్పుడు రెస్క్యూ టీమ్స్‌కు ఓ సవాల్‌ మారింది. అంత లోతున ఉన్న బోటును బయట తీయడం కష్టసాధ్యంగా చెబుతున్నారు ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది. నాలుగైదు కొక్కాలు తగిలించి బోటును పక్కకు లాగే సాధ్యాసాధ్యాలపై సమీక్షిస్తున్నారు.

గజ ఈతగాళ్లు కూడా 50 అడుగుల లోతు వరకు మాత్రమే వెళ్లగలిగారు.. అంతకు మించి లోపలికి వెళ్లలేకపోతున్నారు. ఈ వరద ఉధృతిలో బోటును చేరుకోవడం కానీ, కొక్కెలు తగిలించి బయటకు తీయడం అసాధ్యంగానే భావిస్తున్నారు. కొంత నీటి ప్రవాహం తగ్గిన తర్వాతే బోటును వెలికి తీయగలుగుతామనే ఆశాభావంతో ఉన్నారు. ఇటు ఆచూకీ లభించని వారి మృతదేహాల కోసం అన్వేషణ సాగుతూనే ఉంది. బుధవారం నాటి సహాయక చర్యల్లో ఆరు మృతదేహాలను కనుగొన్నారు రెస్క్యూ టీమ్‌ సభ్యులు. దీంతో ఇప్పటివరకు 34 మృతదేహాలను వెలికితీసినట్టయింది.

ప్రమాద సమయంలోనే 26 మంది సురక్షితంగా బయటపడ్డారు. 34 మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇంకా 13మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. దొరికిన మృతదేహాలు పూర్తిగా పాడైపోయి గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయి. దీంతో సాధ్యమైనంత వేగంగా పోస్ట్‌మార్టమ్‌ పూర్తిచేసి బంధువులకు అప్పగిస్తున్నారు. మొత్తం 7వందల మంది సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్‌లో భాగమయ్యారు. మునిగిన పడవలను వెలికితీయడంలో అనుభవమున్న ఓ ముంబయి కంపెనీకి చెందిన ఇద్దరు నిపుణులను కూడా పిలిపించారు. 
Read More : గోదావరి గాలింపులో పురోగతి : బోటు ఉన్న ప్రదేశం గుర్తింపు