నేడే మార్కెట్ లోకి IIT Delhi Covid Test Kit..రూ. 399 లకే

నేడే మార్కెట్ లోకి IIT Delhi Covid Test Kit..రూ. 399 లకే

కరోనా వైరస్ కు చెక్ పెట్టేందుకు శాస్త్రవేత్తలు, వైద్యులు ఎంతగానో శ్రమిస్తున్నారు. ఇప్పటికే పలు దేశాలు తయారు చేసిన వ్యాక్సిన్ లను ప్రయోగిస్తున్నారు. మరోవైపు కరోనా వైరస్ పరీక్షల కోసం కిట్ ల తయారీలు కూడా జరుగుతున్నాయి.

కానీ..పరీక్షల నిర్వాహణలో ఆలస్యం జరుగుతుండడంతో పాజిటివ్ కేసులు అనూహ్యంగా పెరిగిపోతున్నాయి. దీంతో పలు కంపెనీలు కరోనా వైరస్ కిట్ లను మార్కెట్ లోకి అందుబాటులోకి తెస్తున్నాయి. తాజాగా..ప్రపంచంలోనే అతి చౌకైన పరీక్ష కిట్ ను భారతదేశం మార్కెట్ లోకి తీసుకొస్తోంది.

RT-PCR ఆధారిత కరోనా పరీక్ష కిట్ ను IIT Delhi రూపొందించగా…న్యూ టెక్ మెడికల్ కంపెనీ వాణిజ్యపరంగా తయారు చేసి ‘కోరోసూర్’ పేరిట 2020, జులై 16వ తేదీ గురువారం నుంచి మార్కెట్ లోకి విడుదల కానుంది. ఈ కిట్ రాకతో పరీక్షల తీరు మారుతుందని భావిస్తున్నారు. అంతేగాకుండా..ఈ కిట్ ను అందరూ కొనుక్కొనే విధంగా రూ. 399 లకే అందచేయనుంది.

దీనికి ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, డ్రగ్ కంట్రోల్ జనరల్ ఇండియా అనుమతినిచ్చాయి. ఇతర దేశాలతో పొలిస్తే..ఈ కిట్ చాలా చౌక అని వెల్లడిస్తున్నారు.
IIT Delhi టెక్నాలజీతో న్యూ టెక్ మెడికల్ డివైసెస్ సంస్థ తయారు చేసిన ఈ కిట్ ద్వారా ఒక నెలలో సుమారు 20 లక్షల కరోనా పరీక్షలు చేయవచ్చని ఐఐటీ ఢిల్లీ డైరెక్టర్ వి. రామ్ గోపాల్ రావు వెల్లడించారు.

ఈ పరికరం ద్వారా..వేరే పద్ధతిలో పరీక్షలు నిర్వహిస్తారు. వైరస్ నిర్ధారణ విషయంలో ఎలాంటి రాజీ ఉండదని, వైరస్ సోకింది లేనిదీ..నిర్దిష్టంగా తక్కువ వ్యయంతోనే కనుగొనవచ్చని ఐఐటీ ఢిల్లీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.