ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం : ఇసుక టెండర్ల రద్దు

  • Published By: madhu ,Published On : August 31, 2019 / 03:01 AM IST
ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం : ఇసుక టెండర్ల రద్దు

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంటూ దూసుకెళుతోంది. ఎన్నికల హామీల్లో భాగంగా సీఎం జగన్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. కొత్త ఇసుక విధానంలో రవాణా టెండర్లను రద్దు చేసేసింది. జీపీఎస్ వాహనదారులకు ఇసుక తరలించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. కేంద్రం నుంచి కొనుగోలుదారు వద్దకు ఇసుకను తరలించడానికి వీలుగా రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (APMDC) ఇటీవలే ఈ టెండర్లను పిలిచి వాటిలో కొన్నింటిని ఆమోదించిన విషయం తెలిసిందే. 

నిర్వహించిన టెండర్లలో కొందరు గుత్తే దారులు అతి తక్కువగా కి.మీటర్‌కు రూ. 1.90 చాలని కోట్ చేశారు. 8 జిల్లాల టెండర్లు ఖరారు కాగా..మిగిలిన 5 జిల్లాలకు తాజాగా టెండర్లు పిలిచారు. కిలో మీటర్ ఇసుక తరలింపునకు అతి తక్కువ ధర కోట్ చేయడంతో టెండర్లను రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది. జిల్లా మొత్తం ఒకే కాంట్రాక్టర్ ఉంటే..ఇబ్బందులు వస్తాయని భావించింది.

ఇసుక రవాణా టెండర్లను రద్దు చేస్తూ..గనుల శాఖ కార్యదర్శి 2019, ఆగస్టు 30వ తేదీ శుక్రవారం రాత్రి APMDC అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇప్పటి వరకు ట్రక్కులు, ట్రాక్టర్లలో ఇసుక తరలించడానికి పిలిచిన టెండర్లు మొత్తం రద్దయ్యాయి. GPS ఉన్న వారు గనుల శాఖ సహాయ సంచాలకుల కార్యాలయంలో వివరాలు నమోదు చేసుకుంటే వారందరికీ ఇసుకను తరలించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. కి.మీ.కు రూ. 4.90 ధర ఖరారు చేసినట్లు సమాచారం.