గిదేం పాలన : ఉద్యోగాలను వైసీపీ సర్కార్ తొలగిస్తోంది – బాబు

  • Published By: madhu ,Published On : October 16, 2019 / 11:15 AM IST
గిదేం పాలన : ఉద్యోగాలను వైసీపీ సర్కార్ తొలగిస్తోంది – బాబు

వైసీపీ ప్రభుత్వ ఎంప్లాయిస్ మెంట్ పాలసీపై టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శలు గుప్పించారు. కొత్త ఉద్యోగాల కల్పన పేరిట..ఉన్న ఉద్యోగాలను సీఎం జగన్ ప్రభుత్వం తొలగిస్తోందని ఆరోపించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత..వేతనాలు లేక పశుసఖి కాంట్రాక్టు ఉద్యోగులు అల్లాడుతున్నారని తెలిపారు. అక్టోబర్ 16వ తేదీ బుధవారం..ఉద్యోగులు బాబును కలిశారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఆయనకు వివరించారు. పశు వైద్య శాలల్లో సేవలు చేస్తున్న తమను తొలగించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ…

గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేశామని, వాలంటీర్లను నియమించినట్లు ప్రభుత్వం వెల్లడిస్తోందని..ఇందులో ఉన్న వారంతా ఎవరని ప్రశ్నించారు. అన్ని చోట్లా వైసీపీ కార్యకర్తలకే ఉపాధి కల్పిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్న ఉద్యోగులను తీసేస్తారా ? కార్యకర్తలను నియమించుకోవడానికి బలవంతంగా ఉద్యోగుల చేత రాజీనామాలు చేయిస్తున్నారని ఆరోపణలు చేశారు. ఈ విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలని, సీఎం జగన్ స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. ఇష్టానుసారం చేస్తే..ప్రజల్లో చైతన్యం..అసంతృప్తి వస్తుందని..ఇది ప్రభుత్వానికి మంచిది కాదన్నారు. లక్షలాది మందికి ఉద్యోగాలు ఇచ్చామని గొప్పలు చెప్పుకొంటోందని, ఉన్న వారిని కొనసాగించాలని డిమాండ్ చేశారు. పశుసఖి ఉద్యోగులు చేస్తున్న పోరాటానికి టీడీపీ సంఘీభావం ప్రకటిస్తుందని బాబు వెల్లడించారు. 
Read More : గుడ్ల టెండర్లలో గొడవ : కర్నూలు కలెక్టర్ వద్ద ఉద్రిక్తత