విశాఖలో దళితుడి శిరోముండనం కేసు.. శ్రీకాంత్‌ని కొడుతుండగా మహిళ వీడియో కాల్ చేసింది ఎవరికి, ఆ దృశ్యాలు ఎవరికి చూపింది

  • Published By: naveen ,Published On : August 31, 2020 / 03:26 PM IST
విశాఖలో దళితుడి శిరోముండనం కేసు.. శ్రీకాంత్‌ని కొడుతుండగా మహిళ వీడియో కాల్ చేసింది ఎవరికి, ఆ దృశ్యాలు ఎవరికి చూపింది

ఏపీలో సంచలనం రేపుతున్న విశాఖలో దళితుడి శిరోముండనం కేసులో పోలీసులు దర్యాఫ్తు ముమ్మరం చేశారు. ఈ కేసుని సవాల్ గా తీసుకున్న పోలీసులు నిజానిజాలు రాబట్టే పనిలో ఉన్నారు. తాజాగా ఈ కేసుకి సంబంధించి పోలీసులకు మరో ప్రశ్న ఎదురైంది.



వీడియో కాల్ చేసింది ఎవరికి? దృశ్యాలు చూపింది ఎవరికి?
దళిత యువకుడు శ్రీకాంత్‌ను కొడుతూ, శిరోముండనం చేయించేటప్పుడు అక్కడున్న మహిళల్లో ఒకరు ఎవరికో వీడియో కాల్‌ చేశారు. ఆ విషయాన్ని పోలీసులు నూతన్‌నాయుడి ఇంటి నుంచి సేకరించిన సీసీటీవీ ఫుటేజిలో గమనించారు. ఈ కాల్‌ ఎవరికి చేశారు, ఆ దృశ్యాలను ఎవరికి చూపించారనే అంశాన్ని తెలుసుకునేందుకు మరింత లోతుగా దర్యాప్తు చేపట్టనున్నారు. దాంతోపాటు.. ఈ కేసులో ఇంకెవరికైనా సంబంధం ఉందా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.

కీలకంగా మారిన సీసీటీవీ పుటేజీ:
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన శిరోముండనం కేసులో కీలకంగా మారిన సీసీటీవీ కెమెరా ఫుటేజి సంపాదించడంలో విశాఖ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించారు. తెల్లవారుజామున 3 గంటల వరకు నూతన్‌నాయుడి ఇంట్లోనే ఉంటూ ఎవరూ బయటకు వెళ్లకుండా జాగ్రత్తపడ్డారు. శుక్రవారం (ఆగస్టు 28,2020) సాయంత్రం 5.30 గంటల సమయంలో బాధితుడు శ్రీకాంత్‌ జరిగిన విషయాన్ని మీడియాకు చెప్పి, పోలీసులకు ఫిర్యాదు చేయాలని భావించాడు. ఈ విషయం తెలుసుకున్న పెందుర్తి పోలీసుస్టేషన్‌కు చెందిన ఓ కానిస్టేబుల్‌ వెంటనే ఉన్నతాధికారులకు తెలిపాడు.



వెను వెంటనే అరెస్ట్:
పోలీసు అధికారులు ఈ విషయాన్ని సీపీ మనీష్‌కుమార్‌ సిన్హా దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే ఆయన ఏసీపీ (ఎస్సీ, ఎస్టీ సెల్‌) త్రినాథ్‌, వెస్ట్‌ ఏసీపీ శ్రావణ్‌కుమార్‌లను అప్రమత్తం చేశారు. అదే రోజు సాయంత్రం 6.30కు ఏసీపీలు ఇద్దరూ పెందుర్తి స్టేషన్‌కు వచ్చి శ్రీకాంత్‌ను కలిసి వివరాలు తెలుసుకుని వెంటనే నూతన్‌నాయుడి ఇంటికి వెళ్లారు. అక్కడ సీసీటీవీ కెమెరాలు ఉండటం గమనించి ఫుటేజి సేకరించారు. చుట్టుపక్కల వారినీ ప్రశ్నించారు. శ్రీకాంత్‌ కేకలు విన్నామని.. గుండు కొట్టించి బయటకు తీసుకొచ్చారని వారు చెప్పారు. నిందితుల్లో ముగ్గురిని రాత్రే స్టేషన్‌కు తరలించగా, శనివారం(ఆగస్టు 29,2020) ఉదయం 6 గంటలకు నలుగురు మహిళలను తీసుకొచ్చారు. ఉదయం కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చారు.
https://10tv.in/did-nutan-naidu-have-a-role-in-the-shaved-incident/
నూతన్ నాయుడు భార్య సహా ఏడుగురు అరెస్ట్:
ఈ కేసులో పోలీసులు ఇప్పటికే నూతన్ నాయుడు భార్య సహా ఏడుగురిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో నూతన్ నాయుడి పాత్రపైనా ఆరా తీస్తున్నారు. శిరోముండనం వెనుక నూతన్ నాయుడు ప్రోద్బలం ఉన్నట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనకు ముందు తర్వాత నూతన్ నాయుడు కాల్ డేటాను పరిశీలిస్తున్నారు. అటు, నూతన్ నాయుడిని అరెస్ట్ చేయాలంటూ దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి.



వాళ్లు బెదిరించారు, అందుకే నాకు గుండు కొట్టాడు:
శిరోముండనం కేసులో కొత్త కోణం వెలుగుచూసింది. ఏ7 నిందితుడిగా ఉన్న బార్బర్ రవిని నూనత్ నాయుడు ఫ్యామిలీ బెదిరించిందని బాధితుడు శ్రీకాంత్ చెబుతున్నాడు. బార్బర్ రవి తన రూమ్ మేట్ అని, తనను కొడుతుంటే కాపాడేందుకు వచ్చాడని, శ్రీకాంత్ తెలిపాడు. అయితే తనకు గుండు గీస్తే వదిలి పెడతామని రవిని బెదిరించారని, శ్రీకాంత్ చెప్పాడు. తనను కాపాడుకునేందుకు మరో దారి లేక రవి తనకు శిరోముండనం చేశాడని, అందులో రవి తప్పేమీ లేదని శ్రీకాంత్ చెప్పాడు.

శ్రీకాంత్ కు అండగా ఉంటామని మంత్రి అవంతి హామీ:
బాధితుడు శ్రీకాంత్ ని మంత్రి అవంతి పరామర్శించారు. దాడి జరిగిన తీరుని అడిగి తెలుసుకున్నారు. శ్రీకాంత్ శరీరంపై గాయాలను పరిశీలించారు. అండగా ఉంటానని శ్రీకాంత్ కు మంత్రి హామీ ఇచ్చారు. ఘటనలో దోషులకు కఠిన శిక్ష పడేలా చూస్తామన్నారు. బాధితుడికి అండగా ఉండాల్సింది పోయి రాజకీయ నిరుద్యోగులు ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు.



నూతన్ నాయుడు భార్య సహా ఏడుగురికి రిమాండ్:
విశాఖ పెందుర్తిలో కలకలం రేపిన దళిత యువకుడు శ్రీకాంత్ (20) శిరోముండనం కేసులో నిందితులకు కోర్టు రెండు వారాలు రిమాండ్‌ విధించింది. నూతన్‌ నాయుడు భార్య మధుప్రియతో సహా ఏడుగురిని పోలీసులు సెంట్రల్‌ జైలుకు తరలించారు. పోలీసులు నిందితులను ప్రశ్నించేందుకు కస్టడీ పిటిషన్‌ వేసే అవకాశం ఉంది. మరోవైపు జ్యుడీషియల్‌ రిమాండ్‌ నుంచి తప్పించుకునేందుకు నూతన్ భార్య మధుప్రియ అనారోగ్యమని చెప్పినట్లు తెలుస్తోంది. కానీ కేజీహెచ్‌ వైద్య పరీక్షల్లో ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు తేల్చారట.

ఈ కేసులో నూతన్‌ నాయుడు భార్య మధుప్రియతో సహా ఏడుగురి (ఇందిరా రాణి(26) హౌస్ కీపింగ్ సూపర్ వైజర్, ఝాన్సీ(19) సిబ్బంది, సౌజన్య(29) సిబ్బంది, రవి కుమార్(26) (బార్బర్), బాల గంగాధర్(29), వరహాలు(35) (సూపర్ వైజర్) పై సెక్షన్ 307, 342, 324, 323, 506, r/w 34 ipc 3(1)(e).3(2)(v), sc,st, POA act చట్టం ప్రకారం పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేశారు. మధుప్రియ సూచన మేరకే ఈ శిరోముండనం జరిగినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలిందట.



ఐ ఫోన్ దొంగతనం చేశాడని శ్రీకాంత్ పై దాడి:
విశాఖ పెందుర్తిలో బిగ్‌బాస్ కంటెస్టెంట్‌ నూతన్ నాయుడు ఇంట్లో యువకుడికి శిరోముండనం చేశారు. దళిత యువకుడు శ్రీకాంత్ నూతన్ నాయుడు ఇంట్లో హౌస్ కీపింగ్ పని చేసేవాడు. 6 నెలల పాటు పని చేశాడు. సడెన్ గా ఆగస్టు 1వ తేదీన శ్రీకాంత్ చెప్పకుండా పని మానేశాడట. దీంతో ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. శుక్రవారం (ఆగస్టు 28) శ్రీకాంత్ ని నూతన్ నాయుడు భార్య వరహాలు ద్వారా ఇంటికి పిలిపించింది. తన ఐ ఫోన్ పోయిందని, అది శ్రీకాంత్‌ దొంగిలించాడని మధుప్రియ ఆరోపించింది. ఇంట్లోకి వచ్చిన శ్రీకాంత్ ని నూతన్ నాయుడు భార్య, కుటుంబ సభ్యులు బాగా కొట్టారు. ఆ తర్వాత గుండు కూడా కొట్టించారు. తనకు జరిగిన అన్యాయంపై బాధితుడు పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. శ్రీకాంత్ ను నూతన్ నాయుడు కుటుంబసభ్యులు అతి దారుణంగా కొట్టి, గుండు కొట్టించిన దృశ్యాలు సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యాయి. ఇప్పుడీ కేసు సంచలనంగా మారింది.