దాబాలకు వెళ్తున్నారా, అయితే జాగ్రత్త.. ఢిల్లీకి సమీపంలోని దాబాలో పనిచేసే 65మందికి కరోనా, 10వేల మందిని గుర్తించే పని ముమ్మరం

  • Published By: naveen ,Published On : September 5, 2020 / 08:21 AM IST
దాబాలకు వెళ్తున్నారా, అయితే జాగ్రత్త.. ఢిల్లీకి సమీపంలోని దాబాలో పనిచేసే 65మందికి కరోనా, 10వేల మందిని గుర్తించే పని ముమ్మరం

దేశవ్యాప్తంగా కరోనావైరస్‌ మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. నిత్యం రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ప్రపంచంలో ఏ దేశంలోనూ లేని విధంగా భారత్ లో రోజువారీ కేసులు బయటపడుతున్నాయి. తాజాగా ఒక్కరోజే 80వేలకుపైగానే కేసులు నమోదవుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. సెప్టెంబర్ లో కరోనా పీక్స్ కు వెళ్తుందని ముందే అంచనా వేశారు. దానికి తగ్గట్టుగానే కేసులు వెలుగుచూస్తున్నాయి. కాగా, ఢిల్లీకి సమీపంలోని ఓ దాబాలో కరోనా కలకలం రేగింది. దాబాలో పని చేసే వారిలో ఏకంగా 65మందికి కోవిడ్ సోకింది. కాగా, ఈ దాబాకు ఇప్పటివరకు 10వేల మంది వరకు వచ్చి ఉంటారనే అంచనా ఆందోళనకు గురి చేస్తోంది.

సూపర్‌ స్ప్రెడర్ గా దాబా:
ముఖ్యంగా రద్దీ ప్రదేశాలు, మార్కెట్లు వైరస్‌ వ్యాప్తికి కేంద్రంగా మారుతున్నాయి. తాజాగా ఢిల్లీ సమీపంలోని ఓ దాబా కూడా వైరస్‌ వ్యాప్తిలో సూపర్‌ స్ప్రెడర్‌గా మారింది. దీనిలో పనిచేసే కార్మికుల్లో 65మందికి వైరస్‌ సోకినట్లు తేలింది. దీంతో అప్రమత్తమైన అధికారులు, ఇక్కడకు వచ్చిన వేల మందిని కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ ద్వారా గుర్తించే పనిలోపడ్డారు. గత కొన్నిరోజులుగా ఇక్కడకు దాదాపు 10వేల మంది వచ్చి ఉంటారని అంచనా వేస్తున్నారు.

కస్టమర్లతో కిటకిటలాడుతున్న దాబాలు:
కరోనా వైరస్‌ విజృంభణతో ఇప్పటికే హోటళ్లు, వ్యాపార సంస్థలు దెబ్బతిన్నాయి. అయితే గతకొన్ని రోజులుగా అన్‌లాక్‌ ప్రక్రియలో భాగంగా వీటిని తెరిచేందుకు కేంద్ర ప్రభుత్వం వీలు కల్పించింది. దీంతో హోటళ్లు తెరుచుకున్నాయి. ఢిల్లీ నుంచి హరియాణా, పంజాబ్‌ వెళ్లే జాతీయ రహదారిలో ఉన్న హోటళ్లు నిత్యం వందల మందితో కిటకిటలాడుతుంటాయి. దీంతో జాతీయ రహదారిపై ఉన్న దాబాలకు వచ్చేవారితో పాటు హోటళ్ల నిర్వహకులను స్థానిక అధికారులు అప్రమత్తం చేస్తూనే ఉన్నారు.

దాబాలో పనిచేసే 65మంది కార్మికులకు కరోనా:
తాజాగా ‘సుఖ్‌దేవ్‌ దాబా’లో రద్దీ పెరగడంతో అనుమానించిన అధికారులు, హోటల్‌లోని కార్మికులకు కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. వీటిలో ఏకంగా 65మందికి పాజిటివ్‌ అని తేలింది. ఆ దాబాలో దాదాపు 350మంది కార్మికులు పనిచేస్తున్నట్లు సమాచారం. దీంతో సూపర్‌ స్ప్రెడర్‌గా మారిన ఈ హోటల్‌ను తాత్కాలికంగా మూసివేసిన అధికారులు, శానిటైజ్‌ ప్రక్రియ చేపట్టారు.

దాబా మూసివేసి శానిటైజ్:
అంతేకాకుండా కొవిడ్‌ నిబంధనల ప్రకారం దాబాను కంటైన్‌మెంట్‌ ప్రాంతంగా ప్రకటించామని సోనిపట్‌ జిల్లా అధికారి శ్యామ్‌లాల్‌ పునియా వెల్లడించారు. అదే ప్రాంతంలోని మరో దాబాలో పరీక్షలు నిర్వహించగా అక్కడా 10మందికి వైరస్‌ నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ దాబాలకు వచ్చిన వేల మందిని కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ ద్వారా గుర్తించడం అధికారులు పెద్ద సవాల్‌గా మారింది.

బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్రకు చెందిన దాబాలో కరోనా కలకలం:
వాస్తవానికి ఈ రెండూ ప్రముఖ రెస్టారెంట్లు. హర్యానాలోని ముర్తాల్ లో ఉంటాయి. ఢిల్లీకి సమీపంలోనే ఉంటుంది. బుధవారం(సెప్టెంబర్ 2,2020) అమ్రిక్ సుఖ్ దేవ్ దాబాలో 360మంది సిబ్బందికి కరోనా టెస్టులు చేశారు. వారిలో 65మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. మరో 10మంది సిబ్బంది గరమ్ దరమ్ అనే దాబాకు చెందిన వారు. ఇది కూడా ముర్తాల్ లోనే ఉంటుంది. దిగ్గజ బాలీవుడ్ నటుడు ధర్మేంద ఈ దాబాకు ఓనర్.

పరాటాలకు చాలా ఫేమస్, నిత్యం వేల మంది వస్తుంటారు:
ఈ ఉదంతంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ఇకపై దాబాల్లో తరుచుగా తనిఖీలు చేస్తామన్నారు. దాబాల్లో భద్రతా మార్గదర్శకాలు పాటించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ముర్తాల్ హైవేపై పెద్ద సంఖ్యలో రెస్టారెంట్లు ఉన్నాయి. ఇవి దేశ రాజధాని ఢిల్లీకి 70 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. ఢిల్లీ, చండీగర్ మధ్య నిత్యం వేల సంఖ్యలో ప్రయాణికులు తిరుగుతుంటారు. వారంతా ఈ దాబాలకు వస్తుంటారు. పరాటాస్ కు చండీగర్ రెస్టారెంట్లు చాలా ఫేమస్. సమీపంలోని జిల్లాల్లో నివాసం ఉంటున్న వారు వీకెండ్ లేట్ నైట్ పార్టీలు చేసుకోవడానికి ఎక్కువగా ఈ దాబాలకే వస్తుంటారు.